ఘన వీడ్కోలు.. చివరి మ్యాచ్ ఆడేసిన మెస్సి.. భావోద్వేగంతో కన్నీళ్లు
ABN , Publish Date - Oct 07 , 2026 | 09:04 AM
లియోనెల్ మెస్సి చివరిసారిగా జాతీయ జెర్సీలో మైదానంలోకి దిగాడు. బెనిన్‌తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే మెస్సికి లభించిన వీడ్కోలే ప్రపంచవ్యాప్తంగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఇంటర్నెట్ డెస్క్: లియోనెల్ మెస్సి.. ఫుట్‌బాల్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. అర్జెంటీనా జాతీయ జట్టు కోసం దాదాపు రెండు దశాబ్దాలుగా ఎన్నో అద్భుతాలు చేసిన ఈ దిగ్గజం.. చివరిసారిగా జాతీయ జెర్సీలో మైదానంలోకి దిగాడు. బెనిన్‌తో జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో ఘన విజయం సాధించింది. ఇటీవలే మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
బ్యూనస్ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మోన్యుమెంటల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్.. ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లా కాకుండా మెస్సికి ఘన వీడ్కోలు వేడుకగా మారిపోయింది. అర్జెంటీనా జాతీయ జట్టుకు మెస్సి అందించిన మరపురాని విజయాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు కన్నీళ్లతో తమ హీరోకు వీడ్కోలు పలికారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే మెస్సి వీడ్కోలు కార్యక్రమాలు మొదలయ్యాయి. మోన్యుమెంటల్ స్టేడియంలో నంబర్-10 భారీ జెర్సీని ఏర్పాటు చేశారు. దానిపై ‘గ్రేసియాస్’ (ధన్యవాదాలు) అని రాసి ఉంది. మెస్సికి అభిమానులు చెప్పాలనుకున్న మాటను ఆ ఒక్క పదమే చెప్పేసింది. మెస్సి తన ముగ్గురు కుమారులు థియాగో, మాటియో, సిరోతో కలిసి మైదానంలోకి అడుగుపెట్టాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బాణసంచా వెలుగులతో స్టేడియం మెరిసిపోయింది. గీతం కొనసాగుతున్న సమయంలో మెస్సి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోచ్ లియోనెల్ స్కలోనీ కూడా భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు.
ఇవి కూడా చదవండి:
నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ.. సెలెక్టర్లు సాహసమే చేశారు: దినేశ్ కార్తీక్
టీ20ల్లో మెయిడెన్ సెంచరీ.. నా కల నిజమైంది: శ్రేయస్ అయ్యర్