Share News

స్మృతి.. కొత్త నాయకి

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:37 AM

కెప్టెన్సీ నుంచి హర్మన్‌ వైదొలగిన కొన్ని గంటల్లోనే ఆమె స్థానంలో మంధానకు బాధ్యతలు అప్పగించారు. త్వరలో స్వదేశంలో జింబాబ్వేతో జరిగే సిరీ్‌సతో జట్టు కొత్త కెప్టెన్‌గా మంధాన వ్యవహరిస్తుందని బోర్డు...

స్మృతి.. కొత్త నాయకి

జింబాబ్వే సిరీస్ తో బాధ్యతలు

వైస్‌ కెప్టెన్లుగా షఫాలీ, దీప్తి

రెండు జట్లలోనూ శ్రీచరణికి చోటు

టీ20ల్లో పేసర్‌ అరుంధతి

న్యూఢిల్లీ: కెప్టెన్సీ నుంచి హర్మన్‌ వైదొలగిన కొన్ని గంటల్లోనే ఆమె స్థానంలో మంధానకు బాధ్యతలు అప్పగించారు. త్వరలో స్వదేశంలో జింబాబ్వేతో జరిగే సిరీ్‌సతో జట్టు కొత్త కెప్టెన్‌గా మంధాన వ్యవహరిస్తుందని బోర్డు ప్రకటించింది. ఈనెల 16 నుంచి జింబాబ్వేతో మూడు టీ20లు, మూడు వన్డేల్లో భారత జట్టు తలపడనుంది. ఈ సిరీ్‌సకుగాను మం ధాన సారథ్యంలో రెండు జట్లను సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్లలో వన్డేలకు సీనియర్‌ దీప్తి శర్మను, టీ20లకు ఓపెనర్‌ షఫాలీ వర్మను వైస్‌ కెప్టెన్లుగా కూడా నియమించారు. హర్మన్‌ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగినా, రెండు జట్లకు ఆమెను ఎంపిక చేశారు. ఇక, తెలుగమ్మాయిలు శ్రీచరణి రెండు జట్లలోనూ చోట దక్కించుకోగా, అరుంధతి రెడ్డి టీ20లకు మాత్రమే ఎంపికైంది. జింబాబ్వేతో మూడు టీ20లు ఈనెల 16, 18, 20వ తేదీల్లో రాయ్‌పూర్‌ వేదికగా జరగనుండగా.. ఈనెల 23, 25, 28 తేదీల్లో జరిగే మూడు వన్డేలకు వడోదర ఆతిథ్యమివ్వనుంది. కాగా, జట్టులో కొత్తగా అసోంకు చెందిన 22 ఏళ్ల జింటిమణి కలితకు జట్టులో చోటు దక్కడం విశేషం.

టీ20 జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్‌), షఫాలీ వర్మ (వైస్‌ కెప్టెన్‌), నికీ ప్రసాద్‌, హర్మన్‌ప్రీత్‌, అనుష్క శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), కమలిని (వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, ప్రేమా రావత్‌, శ్రీచరణి, నందని శర్మ, క్రాంతి గౌడ, అరుంధతి, జింటిమణి కలిత, మిన్ను మణి.

వన్డే జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్‌), షఫాలీ, ప్రతికా రావల్‌, హర్మన్‌ప్రీత్‌, హర్లీన్‌, తేజల్‌ హసబ్నిస్‌, దీప్తి శర్మ (వైస్‌ కెప్టెన్‌), రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), యాస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), వైష్ణవి శర్మ, నందని శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ, సయాలీ సత్ఘారె, రేణుకా సింగ్‌.


ఇక.. మంధాన శకం

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

భారత మహిళల క్రికెట్‌లో స్మృతి మంధాన శకం మొదలైంది. చాన్నాళ్లుగా జట్టులో స్టార్‌ క్రీడాకారిణిగా కొనసాగుతున్న 29 ఏళ్ల మంధాన ఇకనుంచి నాయకురాలిగా సరికొత్త పాత్రలో కనిపించనుంది. 2013 నుంచి జాతీయ జట్టుకు ఆడుతున్న మంధానకు ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉంది. హర్మన్‌ గైర్హాజరీలో 22 వైట్‌బాల్‌ మ్యాచ్‌లకు స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించింది. వీటిల్లో 18 అంతర్జాతీయ టీ20లున్నాయి. ఇందులో 11 విజయాలు, 6 ఓటములు నమోదవగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక నాలుగు వన్డేలకు స్మృతి సారథ్యం వహించగా.. అన్నిసార్లూ భారత్‌ నెగ్గడం విశేషం. మరోవైపు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా రెండుసార్లు (2024, 26) జట్టును చాంపియన్‌గా నిలబెట్టింది. డబ్ల్యూపీఎల్‌లో మంధాన నాయకత్వలో ఆర్సీబీ 34 మ్యాచులకు గాను 18 విజయాలు, 17 ఓటములను చవి చూసింది.

ఈ బాధ్యత విలువైనది

‘టీమిండియాకు నాయకత్వం వహించే బాధ్యత గౌరవంతో కూడుకున్నది, విలువైనది. ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. నాపై నమ్మకముంచిన బీసీసీఐ, సెలెక్టర్లు, నా సహచరులతో పాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇన్నేళ్లుగా జట్టు సారథిగా సేవలందించిన హర్మన్‌కు నా అభినందనలు. గొప్ప నిబద్ధతతో ఆమె జట్టును నడిపించింది. ఇక, కెప్టెన్‌గా నా పాత్ర ఏంటో నాకు తెలుసు. భారత క్రికెట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు నావంతు కృషి చేస్తా’

స్మృతి మంధాన

ఈ వార్తలూ చదవండి

విండీస్ 171 పరుగులకు ఆలౌట్.. భారత్ లక్ష్యం 172..

వైభవ్‌తో బ్యాటింగ్ చేస్తే ఒత్తిడే ఉండదు: ప్రియాంశ్ ఆర్య

Updated Date - Oct 07 , 2026 | 05:37 AM