Share News

వైభవ్‌తో బ్యాటింగ్ చేస్తే ఒత్తిడే ఉండదు: ప్రియాంశ్ ఆర్య

ABN , Publish Date - Oct 06 , 2026 | 01:30 PM

పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య.. ప్రస్తుతం ఇండియా-ఎ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌తో కలిసి బ్యాటింగ్‌ చేసిన అనుభవాలను తాజాగా పంచుకున్నాడు.

వైభవ్‌తో బ్యాటింగ్ చేస్తే ఒత్తిడే ఉండదు: ప్రియాంశ్ ఆర్య
Priyansh Arya

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌లో యువ ఆటగాళ్ల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో సత్తా చాటిన పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య.. ప్రస్తుతం ఇండియా-ఎ తరఫున ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా-ఎతో మంగళవారం ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న అతడు.. వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌తో కలిసి బ్యాటింగ్‌ చేసిన అనుభవాలను పంచుకున్నాడు.


ప్రస్తుతం భారత టీ20 జట్టులో అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, సంజు శాంసన్‌ వంటి ఓపెనర్లు రెగ్యులర్‌గా మారడంతో.. ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్‌లకు జాతీయ జట్టులో చోటు కోసం పోటీ మరింత కఠినంగా మారింది. అయితే దీన్ని ఒత్తిడిగా కాకుండా ఆరోగ్యకరమైన పోటీగా చూస్తున్నానని ప్రియాంశ్ వెల్లడించాడు. ‘మా మధ్య అంతా చాలా కూల్‌గా ఉంటుంది. మేమంతా మా ప్రదర్శనపైనే దృష్టి పెడతాం. మీరు ఎంత బాగా ఆడితే అంతగా సెలక్షన్‌ క్రమంలో పైకి వెళ్తారు. ప్రభ్‌సిమ్రన్‌, అభిషేక్‌, వైభవ్‌తో కలిసి బ్యాటింగ్‌ చేశాను. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను. ప్రాక్టీస్‌ సమయంలో వాళ్లను గమనిస్తుంటాను. వాళ్ల బ్యాటింగ్‌ విధానం, దూకుడు నాకు నచ్చుతాయి. వారి పద్ధతుల్లో కొన్ని అంశాలను నా ఆటలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. దాని వల్ల నా ఆటకు ప్రయోజనం కలుగుతుంది’ అని ఆర్య వెల్లడించాడు.


వైభవ్‌ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది..

‘వైభవ్‌తో ఆడటం నాకు చాలా ఇష్టం. అతడు భారీ షాట్లతో పరుగులు చేస్తూ మన పై ఒత్తిడి తొలగిస్తాడు. వైభవ్ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లు కూడా డిఫెన్సివ్‌గా మారిపోతారు. దాంతో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌కు కూడా బ్యాటింగ్‌ సులభమవుతుంది. వైభవ్‌ బ్యాటింగ్‌ను నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌ నుంచి చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. ‘బాగా కొడుతున్నావ్‌ కదా.. అలాగే కొడుతూ ఉండు’ అని వైభవ్‌కు ఎప్పుడూ చెబుతూ ఉంటాను’ అంటూ ప్రియాంశ్ వివరించాడు.


ఇవి కూడా చదవండి:

సూర్యకుమార్‌కు షాక్.. రంజీ ట్రోఫీలోనూ దక్కని చోటు

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బాధ్యత అదే: టీమిండియా బౌలింగ్ కోచ్

Updated Date - Oct 06 , 2026 | 01:35 PM