Share News

నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ.. సెలెక్టర్లు సాహసమే చేశారు: దినేశ్ కార్తీక్

ABN , Publish Date - Oct 07 , 2026 | 07:44 AM

సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేయడంపై మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ హర్షం వ్యక్తం చేశాడు. భువీని మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపిక చేసిన సెలెక్టర్లను అభినందించాడు.

నాలుగేళ్ల తర్వాత భువీ రీఎంట్రీ.. సెలెక్టర్లు సాహసమే చేశారు: దినేశ్ కార్తీక్
Dinesh Karthik

ఇంటర్నెట్ డెస్క్: సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేయడంపై మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ హర్షం వ్యక్తం చేశాడు. భువీని మళ్లీ జాతీయ జట్టులోకి ఎంపిక చేసిన సెలెక్టర్లను అభినందించాడు. అతడు తన ప్రతిభ, ప్రదర్శనతోనే ఈ అవకాశాన్ని సంపాదించుకున్నాడని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భువీని సెలెక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.


‘భారత జట్టులోకి భువీని తీసుకోవడానికి నాలుగేళ్లు పట్టింది. ఇంత గ్యాప్ తర్వాత ఎవరినైనా తిరిగి జట్టులోకి తీసుకోవడం అంత సులువైన విషయం కాదు. సెలెక్టర్లు భువీ విషయంలో సాహసమే చేశారు. గతేడాది టీమిండియా ఎంతో మంది పేసర్లను ప్రయత్నించింది. కానీ నైపుణ్యం పరంగా చూస్తే భువీ అత్యుత్తమంగా ఉన్నాడు. కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్‌ చేయగలడు. చివరి ఓవర్లలో ఒత్తిడిని కూడా సమర్థంగా ఎదుర్కొంటాడు. టీ20ల్లో మ్యాచ్‌లోని వివిధ దశల్లో ఉపయోగపడే బౌలర్‌ భువీ’ అని కార్తీక్‌ ప్రశంసించాడు.


భువీ అర్హుడు..

‘అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే సమయాన్ని అతడు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కేవలం తన ప్రదర్శన ఆధారంగానే ఈ అవకాశాన్ని సంపాదించుకున్నాడు. అతడు దీనికి పూర్తిగా అర్హుడు. ఐపీఎల్ మెగా వేలం గురించి చర్చిస్తున్నప్పుడు భువీ నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా దక్కించుకోవాల్సిందే అనిపించింది. నాకు ఇప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. భువీ లాంటి మంచి మనిషికి ఇలాంటి అవకాశం మళ్లీ రావడం గొప్ప విషయం’ అని కార్తీక్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 07:44 AM