ఢిల్లీ తరువాత విజయవాడలో సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:52 AM
వచ్చే పది రోజుల్లో విజయవాడ ఉత్సవాలకు వేదికగా మారుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. దేశంలో ఢిల్లీ తరువాత విజయవాడలో సరస్ మేళా నిర్వహిస్తున్నారని.. ఈనెల 15వ తేదీన భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 7: వచ్చే పది రోజుల్లో విజయవాడ ఉత్సవాలకు వేదికగా మారుతుందని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఢిల్లీ తరువాత విజయవాడలో సరస్ మేళా నిర్వహిస్తున్నారని.. ఈనెల 15వ తేదీన భారత రాష్ట్రపతి ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిపారు. సరస్ మేళాను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అన్ని రాష్ట్రాల నుంచి డ్వాక్రా మహిళల ఉత్పత్తులతో 650 షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 2500 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. పున్నమి ఘాట్‌లో ఒక వైపు సరస్ మేళా, మరో వైపు విజయవాడ ఉత్సవ్ ఉంటుందని తెలిపారు.
సరస్ మేళా ఈనెల 13 నుంచి 30 వరకు జరుగుతుందని ఎంపీ అన్నారు. ప్రతి ఇంటి నుంచీ ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న సీఎం ఆలోచనకు సరస్ మేళ అద్దం పడుతుందని వెల్లడించారు. మోదీ ఆలోచనలకు అనుగుణంగా సరస్ మేళా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్ని రాష్ట్రాల ఆహారపు విశేషాలతో ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందని చెప్పారు. వచ్చే పదిహేను రోజుల్లో ఇళ్లు, వ్యాపార కేంద్రాలను అందంగా అలంకరించుకోవాలని కోరారు. సరస్ మేళా, దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ మూడూ ఒకే సమయంలో జరగడం పెద్ద పండుగన్నారు.
అనేక రాష్ట్రాల నుంచి సీఎంలు, కేంద్ర మంత్రులు, అనేక మంది ప్రముఖులు తరలిరానున్నారని కేశినేని తెలిపారు. చాలా మందికి ఆహ్వానాలు అందజేశామని, ఇతర రాష్ట్రాల సీఎంల షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉందన్నారు. తిరుమలకు ఎంతోమంది రావడం ద్వారా విశిష్టత పెరిగిందని తెలిపారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రముఖుల ద్వారా దేశం మొత్తం విజయవాడ వైపు చూస్తుందన్నారు. వారు దర్శనం చేసుకునే సమయంలో మాత్రమే కొంత ఇబ్బంది ఉంటుందని అన్నారు. ప్రజలు, మీడియా కూడా ఈ మూడు ఉత్సవాలను దిగ్విజయం చేసేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పున్నమి ఘాట్‌లోని 18 ఎకరాల్లో సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్ జరుగుతుందన్నారు.
రేపు (గురువారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పిల్లలకు విజయవాడ ఉత్సవ్‌పై వివిధ రకాల పోటీలు జరుగుతాయని, తల్లిదండ్రుల సమక్షంలో యాభై రకాల పోటీలను నిర్వహిస్తున్నారని ఎంపీ తెలిపారు. సరస్ మేళా విజయవాడకు రావడం ఎంతో గర్వకారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మేళా జరుగుతుందని చెప్పారు. అమ్మవారి ఉత్సవాలు ఈనెల 20 వరకు జరుగుతాయని.. ఆ తర్వాత 30వ తేదీ వరకు విజయవాడ ప్రజలంతా సరస్ మేళాకు తరలివస్తారన్నారు. నాలుగో పండుగగా ఏపీ, కర్ణాటక రంజీ మ్యాచ్‌కు అంతర్జాతీయ క్రీడాకారులు వస్తున్నారని వెల్లడించారు. విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా లైవ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు కూడా జరుగుతాయన్నారు. సరస్ మేళాలో షాపుల కేటాయింపు మొత్తం ఆన్‌లైన్ విధానంలో జరుగుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మోదీకి చంద్రబాబు అభినందనలు.. 25 ఏళ్ల నాయకత్వంపై ప్రశంసలు
గోదావరి డెల్టా ముంపు పరిష్కారానికి రూ.13.4 కోట్లతో డీపీఆర్: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telugu News