తూర్పుగోదావరిలో మైదాన ప్రాంతాలకు పెద్దపులి.. గ్రామాలకు అలర్ట్
ABN , Publish Date - Oct 07 , 2026 | 07:54 AM
తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి మళ్లీ జాడ మార్చింది. ఇప్పటివరకు అటవీ ప్రాంతాలు, గ్రామాల శివార్లలో సంచరించిన పులి.. తాజాగా మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
తూర్పుగోదావరి, అక్టోబర్ 7: జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. పది నెలలుగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న పెద్దపులి.. తాజాగా మైదాన ప్రాంతాల్లోకి ప్రవేశించింది. తాళ్లపూడి మండలం గజ్జరం, తుపాకుల గూడెం, గోపాలపురం మండలం గోపవరం ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. రేడియో ట్రాకింగ్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. మైదాన ప్రాంతాల వైపు పులి రావడంతో అటవీశాఖ అప్రమత్తమైంది. పులి ఏ ప్రాంతంలో సంచరిస్తోంది, ఏ దిశగా కదులుతోందనే విషయాలను రేడియో ట్రాకింగ్ ద్వారా గమనిస్తూ అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు. పులి సంచారం ఉన్న ప్రాంతాల చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల సీతానగరం మండలం వంగలపూడి, రామచంద్రపురం గ్రామాల మధ్య రాత్రి సమయంలో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. నివాస ప్రాంతాలకు సమీపంలోనే పులి సంచరించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఆ తర్వాత తెల్లవారుజామున పులి గోదావరి నది దాటి పట్టిసీమ వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పట్టిసీమ ప్రాంతం వైపు కూడా పులి కదలికలను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో పట్టిసీమతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పులి కనిపించినా, దాని అడుగుజాడలు లేదా ఇతర కదలికలు గుర్తించినా ప్రజలు దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..