అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..
ABN , Publish Date - Oct 05 , 2026 | 04:06 PM
దేశ రాజధానిలో మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళల భద్రత కోసం పగలు, రాత్రి పెట్రోలింగ్‌ను పెంచడంతో పాటు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేయాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మహిళలపై అత్యాచారాలు, వేధింపుల ఘటనలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహిళల భద్రత కోసం పగలు, రాత్రి పెట్రోలింగ్‌ను పెంచడంతో పాటు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేయాలని ఆదేశించింది. కేవలం మార్గదర్శకాలు జారీ చేయడం కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించింది. ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసును సోమవారం జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు పలు కీలక సూచనలు చేసింది.
పగలు, రాత్రి పెట్రోలింగ్ పెంచాలి..
పెట్రోలింగ్‌ను పోలీసులు పగలు, రాత్రి మరింత పెంచాలని ధర్మాసనం ఆదేశించింది. ముఖ్యంగా బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, కళాశాల ప్రాంగణాలు వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. మహిళలు, యువతులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉండాలని పేర్కొంది. నేరం జరిగిన తర్వాత నిందితులను అరెస్ట్ చేయడం కంటే, నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేసింది. నేరస్తుల్లో నేరానికి పాల్పడితే కఠిన పరిణామాలు ఎదురవుతాయనే భయం కలిగించేలా నిరోధక చర్యలు చేపట్టాలని సూచించింది.
కాగితాలపై ఆదేశాలు సరిపోవు..
మార్గదర్శకాలు, ఆదేశాలను కేవలం కాగితాలకే పరిమితం చేయడం వల్ల ప్రయోజనం ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసు శాఖ ఇచ్చే ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని స్పష్టం చేసింది. అయితే పెట్రోలింగ్ పేరుతో పోలీసులు అతిగా వ్యవహరించవద్దని ధర్మాసనం హెచ్చరించింది. అనుమానం ఆధారంగా నేరాన్ని ముందుగానే అడ్డుకునే చర్యలపై దృష్టి పెట్టాలని సూచించింది.
పోలీసు సిబ్బంది నియామకాలు, శిక్షణపై దృష్టి
ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల్లో వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు కాగ్ ఆడిట్‌లో వెల్లడైందని, పెట్రోలింగ్‌ను పెంచాలంటే ఈ ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అమికస్ క్యూరీ సీనియర్ అడ్వొకేట్ లిజ్ మాథ్యూ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పోలీసు సిబ్బంది నియామకాలు చేపట్టాలని, ముఖ్యంగా కానిస్టేబుళ్లకు ఇటువంటి నేరాలను నివారించేలా తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది. పెట్రోలింగ్ విధుల్లో నిర్లక్ష్యం వహించే పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది.
సీసీటీవీలతో ప్రత్యేక మానిటరింగ్ సెల్
మరోవైపు, పార్కులు, ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించేలా ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసే అంశాన్నీ సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. కంట్రోల్ రూమ్‌కు అందే హెచ్చరికల ఆధారంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకునే వ్యవస్థ ఉండాలని సూచించింది. పార్కులు, రోడ్లు, బస్సులు వంటి ప్రదేశాలను అధిక ప్రమాద ప్రాంతాలుగా మారేందుకు అనుమతించకూడదని పేర్కొంది.
ఏం చర్యలు తీసుకున్నారు..?
2012 నిర్భయ ఘటన నుంచి ఇప్పటివరకు తీసుకున్న చర్యలపైనా కోర్టు ప్రశ్నించింది. మహిళలు హింసకు గురికాకుండా గౌరవంగా జీవించే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 పరిధిలోకి వస్తుందని గుర్తుచేసింది. ఢిల్లీలో మహిళల భద్రత అంశంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 28న ఇచ్చిన ఆదేశాల అమలుపై ఢిల్లీ పోలీసుల నుంచి వివరణాత్మక నివేదికను కోర్టు కోరింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్ 16కి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
నార్త్‌ఈస్ట్ ఢిల్లీలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితుల కాళ్లలోకి బుల్లెట్లు
ఆ రికార్డులను సమర్పించండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం