ఆ చిన్నారి ఘటన మానవత్వానికే మాయనిమచ్చ: కేటీఆర్
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:33 PM
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నాగర్ కర్నూల్ జిల్లాలో ఇటీవల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన గొడవలో రెండు నెలల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) పరామర్శించారు. తమకు న్యాయం చేయాలని చిన్నారి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. బాధిత కుటుంబం ఆందోళన చేస్తున్న శిబిరం వద్దకి వెళ్లి వారితో మాట్లాడి ధైర్యం చెప్పారాయన. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
హంతకులను ప్రభుత్వం వెంటనే శిక్షించాలి..
ఘోరాతి ఘోరమైన మానవత్వానికి మచ్చ తెచ్చే విధంగా చిన్నారిని హత్యచేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులను ప్రభుత్వం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. మల్లన్న జాతరలో చిన్నారి తల్లి దర్శనం అడిగినందుకు ఆ పాపను పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. దేవుడు దర్శనం అడిగిన పాపానికి.. దాడి చేసి మానవత్వానికే మచ్చ తెచ్చారని ఆగ్రహించారు. ఈ దారుణానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని హెచ్చరించారు.
బాధితులకు మేం అండగా ఉంటాం...
‘పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదలిపెట్టమని ప్రాధేయపడ్డ.. వదలకుండా కాలితో ఆ పాపను తన్నితే చనిపోయింది. యూనిఫామ్‌కి విలువ లేకుండా హంతకులను కాపాడే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. రెండు నెలల పసిగుడ్డుకు కులం తెలుసా..?, మనుషులను చిన్నచూపు చూసి దర్శనానికి రానివ్వకుండా చేయడం ఘోరం. హంతకులు ఎవరైనా.. ఏ పార్టీవారైనా కచ్చితంగా శిక్షించాల్సిందే. ఈ ఘటనకు కారణమైనా ఎనిమిది మందిని అరెస్టు చేయాల్సిందే. శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై స్పందించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందే. పొత్తిళ్లలోని పసిగుడ్డును హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాల్సిందే. న్యాయం జరిగేదాకా పోరాటం ఆపకండి. దుర్మార్గులను శిక్షించేదాకా వదిలిపెట్టొద్దు. ఈ ఘటనకు కారణమైనా ఎనిమిదిమందిపై హత్యానేరం మోపకపోతే శాసనసభలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. బాధిత కుటుంబాన్ని కంటికి రెప్పల కాపాడుకుంటాం. కులం, మతం లేదు.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా మేం అండగా ఉంటాం’ అని కేటీఆర్ భరోసా కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
అనాథలకు ఉపాధి కల్పన.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
Read Latest Telangana News And AP News And Telugu News