అనాథలకు ఉపాధి కల్పన.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
ABN , Publish Date - Feb 23 , 2026 | 06:39 PM
అనాథ పిల్లల ఉద్యోగ కల్పనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి..
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అనాథ పిల్లల ఉద్యోగ కల్పనపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జీఎంఆర్ ఎయిర్‌పోర్టు అథారిటీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో (ఫిక్కీ) తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది. తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రభుత్వ సంరక్షణలో ఉన్న అనాథ యువతకు విమానయాన రంగంలో నైపుణ్య శిక్షణ కల్పన దిశలో ఒప్పందాలు జరిగాయి. ఎయిర్‌పోర్టు ఆపరేషన్, కార్గో, గ్రౌండ్ హ్యడ్లింగ్ వంటి కోర్సుల్లో దశల వారీగా శిక్షణ ఇవ్వనున్నాయి.
ఈ శిక్షణ ద్వారా అనాథ యువతకు ప్రైవేట్, అంతర్జాతీయ స్థాయి విమానయాన సంస్థల్లో ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని 2026 మార్చి నుంచి శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరో అకాడమీలో ప్రారంభించనున్నారు. ప్రభుత్వ సంరక్షణలో, శక్తి సథన్‌లో ఉంటున్న అనాథ యువతకు ఉద్యోగ అవకాశాల లక్షంగా శిక్షణ ఇవ్వనున్నారు.
పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ అమ్మాయిలకు ఫిక్కి నిర్వాహకులు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. చదువుకునే కాలంలోనే ఇండ్రస్ట్రీ ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తారు. అంగన్వాడీ టీచర్లకు ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ శిక్షణ కోసం అజీమ్ ప్రెమ్జీ యునివర్సిటీతో ఒప్పందం చేసుకున్నారు. అంగన్వాడీ టీచర్లకు ఇంగ్లిష్‌పై శిక్షణ, పాలన కేంద్రాల్లో చిన్నారులకు అందిచాల్సిన సేవలపై శిక్షణని అజీమ్ ప్రెమ్జీ యునివర్సిటీ ఇవ్వనుంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. అనాథ పిల్లల సంరక్షరణ ప్రభుత్వ బాధ్యత అని వ్యాఖ్యానించారు. వారికి కేవలం ఆశ్రయం కాదని… భవిష్యత్తు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించి వారిని స్వతహగా ఎదిగేలా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి సృష్టి లక్ష్యాలతో రూపొందించిన ఈ కార్యక్రమం ప్రభుత్వం–పరిశ్రమల భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. సమగ్ర పునరావాసం, శిక్షణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్య అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే మార్గదర్శక నిర్ణయంగా నిలవనుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..
చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
Read Latest Telangana News And AP News And Telugu News