Share News

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:53 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహరిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు చేయొద్దని హితవు పలికారు.

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి
Telangana CM Revanth Reddy

ములుగు , ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తాము సహరిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు చేయొద్దని హితవు పలికారు. అక్కడ సెటిల్ అయిన వారికి తామెందుకు సహకరిస్తామని ప్రశ్నించారు. ఇవాళ(ఆదివారం) ములుగు జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. తుపాకులగూడెం దేవాదుల ప్రాజెక్టుని సందర్శించారు. దేవాదుల పనుల పురోగతిపై అధికారులతో సీఎం రేవంత్‌ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పక్క రాష్ట్రాల వారితో చర్చించి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు విలువైన సూచనలిస్తే స్వీకరిస్తామని చెప్పుకొచ్చారు. ఓటేయకపోవడం ప్రజలదే తప్పు అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గోదావరి నది జలాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిద్దామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేద్దామంటే నిధుల కొరత వచ్చిందని ప్రస్తావించారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని తెలిపారు.


కాళేశ్వరం మహా అద్భుతం అన్నారు..

త్వరలోనే అన్ని నిధులనూ విడుదల చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేవాదుల ప్రాజెక్టు 2001లో రూ.6వేల అంచనాతో మొదలై.. రూ.18,500 కోట్లకు అంచనాలు పెరిగాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం మహా అద్భుతం అన్నారని.. తాము వచ్చినప్పటి నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయలేదని చెప్పుకొచ్చారు. అయినా దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి జరిగిందని అన్నారు. ప్రాజెక్టులు, నీళ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని తెలిపారు. బీఆర్ఎస్ నేతలంతా జ్ఞానవంతులమని తాము చెప్పడం లేదని.. మీరు సూచనలు చేస్తే తీసుకుంటామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయకుండా ఉపయోగంలోకి తెస్తామని స్పష్టం చేశారు. ఒక్క కాళేశ్వరం పైనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు.


కృష్ణా జలాలపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చాం..

గోదావరి జలాల వివాదం రాజకీయరంగు పులుముకుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల తరలింపు అంశంపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు నీళ్లు, నిధులు బాగానే ఉన్నాయని ప్రస్తావించారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే.. వివాదాలే ఉండేవి కావని చెప్పుకొచ్చారు. 960 టీఎంసీలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే సమస్యే ఉండేది కాదని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. రూ.6 వేల కోట్ల అంచనాతో ప్రారంభించిన దేవాదుల.. ఇవాళ రూ.18 వేల కోట్ల వ్యయానికి చేరిందన్నారు. ప్రాజెక్టుల కోసం భూసేకరణకు నిధుల కొరత ఉందన్నారు. భూ సేకరణ కోసం నిధులు వెతుక్కునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రెండు, మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా కృషి చేస్తామని అన్నారు.


భూసేకరణ కోసం రూ.600 కోట్లు మంజూరు చేస్తాం..

జూన్ 2వ తేదీ లోపల భూసేకరణ కోసం రూ.600 కోట్లు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో పై అన్ని అంచనాలనూ ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకోవాలని తెలిపారు. మార్చిలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదిస్తామన్నారు. నెలలోపే దేవాదుల పంప్ రిపేర్ చేయాలని అధికారులని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, అధికారులతో దేవాదులపై కమిటీ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. అన్ని ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరు అందించే ప్రణాళికపై నివేదిక ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిహారం గ్రీన్ ఛానల్‌లో నిధులు మంజూరు చేస్తామని.. భూ సేకరణ జాప్యం వల్ల ప్రాజెక్టుల పనులు ఆగడానికి వీలు లేదని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 06:50 PM