Share News

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

ABN , Publish Date - Feb 22 , 2026 | 09:18 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి ఏఐ పాలసీ సింపోజియానికి అధికారిక ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం మార్చి 27వ తేదీన హార్వర్డ్ క్యాంపస్‌లో జరగనుండగా, భారత్ నుంచి ఆహ్వానం పొందిన ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు.

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి (Telangana CM Revanth Reddy) అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. అమెరికాలోని ప్రముఖ విద్యా సంస్థ హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (Harvard Kennedy School) నుంచి అధికారికంగా ఆహ్వానం అందింది. మార్చి 27వ తేదీన హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించనున్న ఏఐ పాలసీ సింపోజియంలో పాల్గొని ప్రసంగించేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు. ఈ సింపోజియంలో ‘AI as Infrastructure & Compute Power’ అనే కీలక అంశంపై జరిగే ప్రత్యేక ప్యానెల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ వేదికపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను భవిష్యత్ మౌలిక వసతులుగా ఎలా అభివృద్ధి చేయాలి, డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూటింగ్ సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై చర్చ జరగనుంది.


ఈ కార్యక్రమానికి భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలవడం తెలంగాణకు గౌరవకారణంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, పరిశ్రమలు, అకాడమిక్ సంస్థలు కలిసి ఏఐ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై చర్చించనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ఏఐ సిటీ ప్రాజెక్టు, రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న ఏఐ ఎకోసిస్టమ్, డేటా సెంటర్ల ఏర్పాటు, టెక్నాలజీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ వంటి అంశాలపై సీఎం ప్రత్యేకంగా ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణను ఏఐ రంగంలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రపంచానికి వివరించే అవకాశం ఈ వేదిక ద్వారా లభించనుంది.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, టెక్నాలజీ నిపుణులు, అకాడమిక్ నేతలు ఒకే వేదికపై సమావేశమై ఏఐ భవిష్యత్తు, డిజిటల్ మౌలిక వసతులు, కంప్యూటింగ్ సామర్థ్యాల విస్తరణపై చర్చించనున్నారు. ఏఐ రంగంలో ప్రభుత్వ పాత్ర, పరిశ్రమల భాగస్వామ్యం, పరిశోధన సంస్థల సహకారం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏఐ సిటీ ఏర్పాటు, డేటా సెంటర్ల అభివృద్ధి, స్టార్టప్‌ల ప్రోత్సాహం, టెక్నాలజీ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించింది.


ఈ నేపథ్యంలో హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నుంచి వచ్చిన ఆహ్వానం తెలంగాణ టెక్నాలజీ రంగ అభివృద్ధికి గుర్తింపుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆహ్వానం ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరగడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ద్వారా తెలంగాణ ఏఐ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు, విధానాలు ప్రపంచ వేదికపై ప్రదర్శించడానికి ఓ సువర్ణవకాశంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఢిల్లీకి కప్పం కట్టడానికి రైతుబంధు ఎగ్గొట్టారు.. సీఎంపై ఏలేటి షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 09:45 PM