Minister Thummala: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jan 16 , 2026 | 03:18 PM
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. వానాకాలం 2025-2026 సీజన్‌లో కందులకు ఎంఎస్పీ ద్వారా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
ఖమ్మం, జనవరి16 (ఆంధ్రజ్యోతి): రైతులకు గిట్ధుబాటు ధర ఇవ్వడం కోసం తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. వానాకాలం 2025-2026 సీజన్‌లో MSP ద్వారా కందుల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. శుక్రవారం.. ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటించిన ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులకు లాభదాయక ధర కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, టీజీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో MSP కొనుగోళ్లు ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,99,393 ఎకరాల్లో కందులు సాగవుతున్నాయని పేర్కొన్నారు మంత్రి తుమ్మల.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
వాస్తవానికి సుమారు 2,99,635 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశామని తుమ్మల తెలిపారు. ఈ లెక్కన క్వింటాల్‌కు రూ. 8,000 MSP నిర్ణయించామన్నారు. అయితే.. ప్రస్తుతం మార్కెట్ ధర రూ. 7,200 వరకు మాత్రమే ఉందని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,71,310 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని వివరించారు. 2025 డిసెంబర్ 27 నుంచి 2026 మార్చి 26 వరకు కొనుగోళ్లు జరుగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 82 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించామని తెలిపారు. ఇప్పటికే 13 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు వివరించారు. జనవరి 16 నాటికి 32 మంది రైతుల నుంచి 30.25 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు జరుగుతాయనే అంచనా వేశామని వెల్లడించారాయన.
మధ్యవర్తులకు పంటను అమ్మొద్దు..
వీటి మొత్తం విలువ రూ. 0.24 కోట్లు ఉంటుందని అంచనా వేశామని పేర్కొన్నారు మంత్రి. నారాయణపేట జిల్లాలో కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఆయా పంటల రాకల ఆధారంగా ఇతర జిల్లాల్లోనూ దశలవారీగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్నదాతలు మధ్యవర్తులకు పంటను అమ్మొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. టీజీ మార్క్‌ఫెడ్ కేంద్రాలకు మాత్రమే పంటను తీసుకురావాలని సూచించారు. కొనుగోలు మొత్తాన్ని డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు భరోసానిచ్చారు.
ఇవి కూడా చదవండి...
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది
సంక్రాంతి వేళ దొంగల హల్‌చల్.. చెంగిచెర్లలో భారీ చోరీలు
Read Latest Telangana News And Telugu News