Share News

Telangana MLAs Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది

ABN , Publish Date - Jan 16 , 2026 | 10:44 AM

బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Telangana MLAs Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది
Telangana MLAs Defection Case

న్యూఢిల్లీ, జనవరి 16: తెలంగాణలో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారానికి సంబంధిన కేసు విచారణ ఈరోజు (శుక్రవారం) సుప్రీం కోర్టులో (Supreme Court) జరగనుంది. వింటర్ వెకేషన్ తరువాత తొలిసారి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. మరోవైపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో ఏడుగురిపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. నిన్న (జనవరి 15) పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలపై పిటిషన్లను స్పీకర్ తిరస్కరించారు. వీరిపై పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, వీరిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు ఆయన తేల్చారు. అలాగే ఇంతకుముందు ఐదుగురిపై కూడా స్పీకర్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు.


కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య తదితరులు 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు వీరిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని కంప్లైంట్ ఇచ్చారు. అయితే స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌‌ను ఆదేశించింది. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.


నేటితో సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు ముగియనుంది. ఒక్కరోజు ముందు నిన్న (గురువారం) ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఎం. సంజయ్ కుమార్‌‌పై నిర్ణయాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. నేడు సుప్రీంలో జరిగే విచారణలో స్పీకర్ నిర్ణయాలపై బీఆర్ఎస్ వాదనలు వినిపించనుంది. అలాగే కాంగ్రెస్ తరఫున కూడా వాదనలు జరుగనున్నాయి. అయితే స్పీకర్ నిర్ణయాలను సుప్రీం ధర్మాసనం సమర్థిస్తుందా? లేక మరేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటుందా అనేది మరికాసేపట్లో తేలనుంది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.


ఇవి కూడా చదవండి...

ఆ కుక్కకు ఏమైంది.. నాలుగు రోజులుగా దేవతల విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు

వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 11:02 AM