Telangana MLAs: మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:15 PM
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటికే వీరిద్దరినీ పలుమార్లు విచారించిన స్పీకర్.. తుది నిర్ణయం ప్రకటించారు.
హైదరాబాద్, జనవరి 15: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. వీరిద్దరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు ఆయన తీర్పు వెలువరించారు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ స్పీకర్ ఇదే తరహాలో తీర్పు ఇచ్చిన విషయం విదితమే.
పార్టీ ఫిరాయింపులపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిలపై అనేక సార్లు విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదోపవాదనల అనంతరం.. వీరు పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు.
అందుకు సంబంధించిన ఉత్తర్వులు మరికాసేపట్లో వెలువరించనున్నారు. గతంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ ఇదే తరహా తీర్పును వెలువరించారు. పార్టీ మారినట్లు వారిపై ఆధారాలు లేకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అయితే మరో ముగ్గురు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్‌లకు సంబంధించిన కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై ఇప్పటికే విచారణ పూర్తయింది. ఈ తీర్పును రిజర్వు చేసి ఉంచారు. అయితే, ఎమ్మెల్యే సంజయ్ విషయానికి వచ్చేసరికి తగిన ఆధారాలు లేవని స్పీకర్.. ఆయనకు సైతం క్లీన్ చీట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం గతంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు.
అలాగే కడియం శ్రీహరి మాత్రం తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..
Read Latest Telangana News and National News