Honey Trap Couple Arrested: భార్యాభర్తల గలీజ్ దందా.. 100 మందికిపైగా పురుషులతో..
ABN , Publish Date - Jan 16 , 2026 | 09:14 AM
కరీంనగర్ జిల్లాలో భార్యాభర్తల గలీజ్ దందా కలకలం రేపింది. మూడేళ్లలో వంద మందికిపైగా బాధితులను మోసం చేసినట్టు తేలడంతో దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
కరీంనగర్: సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అమాయకులైన పురుషులను వలలో వేసి, శృంగార వీడియోలతో బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసిన భార్యాభర్తల బండారం బయటపడింది. గత మూడేళ్లుగా ఈ దందా సాగిస్తున్న దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావు పేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్‌లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి మంచిర్యాలకు చెందిన 29 ఏళ్ల మహిళతో వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో తీసుకున్న లోన్‌లకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో భార్యాభర్తలు కలిసి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయంగా పోస్టులు పెట్టి పురుషులను ఆకర్షించడం ప్రారంభించారు. వ్యాపారులు, యువకులు వారి వలలో పడగానే, మహిళ వారిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిచి సన్నిహితంగా మెలిగేది. అదే సమయంలో భర్త రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీసేవాడు.
తరువాత బాధితులకు ఫోన్ చేసి, వీడియోలను కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపిస్తాం అంటూ బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసేవారు. భయపడిన పలువురు వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. ఇలా మూడేళ్లలో సుమారు 100 మందికిపైగా పురుషుల నుంచి లక్షల రూపాయలు దండుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇటీవల కరీంనగర్‌కు చెందిన ఓ లారీ వ్యాపారిని కూడా ఇదే విధంగా బ్లాక్‌మెయిల్ చేసి రూ.13 లక్షలు వసూలు చేశారు. మరోసారి రూ.5 లక్షలు కావాలంటూ బెదిరించడంతో, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి మొబైల్ ఫోన్లు, వీడియోలు, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేగింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా వ్యవహరించే వారిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాలిపటంలా జీవితంలో పైకి ఎదగాలి: హరీష్ రావు
పొంగల్ ఎఫెక్ట్.. ప్రయాణికులు లేక ఐదు ప్రత్యేక రైళ్ల రద్దు
For More TG News and National News