Harish Rao: గాలిపటంలా జీవితంలో పైకి ఎదగాలి: హరీష్ రావు
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:53 PM
చలికాలంలో ఇంట్లో ఉంటే శరీరానికి సూర్యరశ్మి అందదని.. అందువల్ల పతంగి ఎగురవేయడం చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ పండుగ వేళ.. పిల్లలు, పెద్దలు అంతా బయటకు వచ్చి సాయంత్రం వరకు పతంగులు ఎగురవేయడం వల్ల శరీరానికి ఎండ తగలడంతో డి విటమిన్ అందుతుందని ఆయన వివరించారు.
సిద్దిపేట, జనవరి 15: గాలిపటంలాగా జీవితంలో పైకి ఎదగాలని యువతకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట పట్టణంలో 36వ వార్డులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువకులతో కలిసి పతంగిని హరీష్ రావు ఎగురవేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. పండుగల వేళ మనమంతా బాధ్యతగా ఉండాలన్నారు.
ప్రభుత్వం నిషేధించిన ప్రాణాంతక చైనా మాంజా వాడొద్దని యువతకు స్పష్టం చేశారు. ఎవరన్నా వాడినా పోలీసులకి సమాచారం ఇవ్వాలని వారికి సూచించారు. ఇప్పటికే చైనా మాంజా వల్ల ముగ్గురు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి పశు, పక్ష్యాదులకు ప్రాణాంతకంగా మారాయని పేర్కొన్నారు.
చైనా మాంజా ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఆయన సూచించారు. కొత్త సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగ సంక్రాంతి అని ఆయన గుర్తు చేశారు. ప్రతి పండగ వెనుక నమ్మకాలు, విశ్వాసాలతో పాటు సైన్స్ సైతం ఉందని వివరించారు.
చలికాలంలో ఇంట్లో ఉంటే శరీరానికి సూర్యరశ్మి అందదని.. అందువల్ల పతంగి ఎగుర వేయడాన్ని చేస్తారని తెలిపారు. ఈ పండగ వేళ.. పిల్లలు, పెద్దలు అంతా బయటకు వచ్చి సాయంత్రం వరకు పతంగులు ఎగురవేయడం వల్ల శరీరానికి ఎండ తగలడం ద్వారా డి విటమిన్ అందుతుందని మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కైట్ ఫెస్టివల్.. సందర్శకులను ఆకర్షిస్తున్న రంగురంగుల గాలిపటాలు
పొంగల్ ఎఫెక్ట్.. ప్రయాణికులు లేక ఐదు ప్రత్యేక రైళ్ల రద్దు
For More TG News and National News