Share News

Supreme Court: బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

ABN , Publish Date - Jan 16 , 2026 | 12:56 PM

సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. రెండు వారాల తర్వాత తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది.

Supreme Court: బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం కోర్టులో విచారణ వాయిదా
Supreme Court

న్యూఢిల్లీ, జనవరి 16: బీఆర్‌ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో (Supreme Court) విచారణ వాయిదా పడింది. రెండు వారాల తరువాత ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Assembly Speaker Gaddam Prasad Kumar) చేపట్టిన ప్రక్రియపై అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే నాలుగు వారాల సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో పురోగతిని పరిశీలించి అవసరమైతే మరో రెండు వారాల గడువు పెంచుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.


ఈరోజు (శుక్రవారం) ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌ల ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని.. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయానికి కొంత సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది కోరారు. స్పీకర్‌కు కంటి శస్త్ర చికిత్స జరగడంతో ఆస్పత్రిలో ఉన్నారని, కొత్త అసెంబ్లీ సెక్రటరీ జనరల్ వచ్చినందున ప్రక్రియ ఆలస్యమైందని న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ కోర్టుకు నివేదించారు. ఇప్పటివరకు స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను నివేదిక రూపంలో ఆయన కోర్టుకు సమర్పించారు. మిగతా ముగ్గురు సభ్యులపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాల సమయం కావాలని ధర్మాసనానికి స్పీకర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.


గత ఏడాదిగా ఇదే చెబుతున్నారని బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో మూడు నెలల్లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని, మిగిలిన ముగ్గురిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ కోర్టును కోరారు. అయితే రెండు వారాలు సమయం ఇస్తున్నామని.. రెండు వారాల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కోర్టుకు చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఆ తరువాత అవసరం అయితే మరో రెండు వారాలు సమయం ఇస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం చెబుతూ.. తదుపరి విచారణను వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి...

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది

సంక్రాంతి వేళ దొంగల హల్‌చల్.. చెంగిచెర్లలో భారీ చోరీలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 01:27 PM