Hyderabad Theft: సంక్రాంతి వేళ దొంగల హల్‌చల్.. చెంగిచెర్లలో భారీ చోరీలు
ABN , Publish Date - Jan 16 , 2026 | 11:32 AM
సంక్రాంతి పండుగ వేళ దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 12 ఇళ్లల్లో చోరీకి తెగబడ్డ దుండగులు.. భారీగా నగదు, నగలను అపహరించారు.
హైదరాబాద్, జనవరి 16: నగర శివారులోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా హల్‌చల్ చేసింది. సంక్రాంతి పండుగ సమయంలో చెంగిచెర్ల కాలనీలో గుర్తు తెలియని దొంగల ముఠా పలు ఇళ్లలోకి చొరబడి భారీ చోరీలకు పాల్పడింది. తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దొంగల ముఠా చేతిలో కత్తులు, ఇతర ఆయుధాలతో చెంగిచెర్ల కాలనీలో సంచరించింది. ముందుగానే రెక్కీ చేసుకుని, కారులో వచ్చిన ఈ ముఠా దాదాపు 12 ఇళ్లలోకి చొరబడి నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకుంది.
వరుసగా ఇళ్లల్లో చోరీకి తెగబడ్డ దుండగులు ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. తమ ఇళ్లలో దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితులు వెంటనే మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
పండుగ సమయంలో చాలా మంది స్వస్థలాలకు వెళ్లిపోవడంతో ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని అదునుగా భావించి దొంగలు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా.. సంక్రాంతి సమయంలో స్వగ్రామలకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని, పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, సీసీటీవీలు, అలారం సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచనలు చేశారు. త్వరలోనే దొంగల ముఠాను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది
Read Latest Telangana News And Telugu News