రైతుల సమస్యలు పట్టించుకోరా.. కాంగ్రెస్ సర్కార్‌పై జీవన్‌రెడ్డి ఫైర్
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:27 PM
అన్నదాతల సమస్యలను పట్టించుకోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహించారు.
జగిత్యాల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): అన్నదాతల సమస్యలను పట్టించుకోవడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహించారు. రైతుల పంటకు తగిన ధర దక్కకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. మొక్కజొన్నను మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులతో కలిసి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ..
జగిత్యాల పట్టణంలో రైతులు ఈరోజు(సోమవారం) పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జీవన్‌రెడ్డి నాయకత్వం వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మొక్కజొన్న రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలపడానికి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. రైతుల చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడారు. మొక్కజొన్న పంటకు తగిన ధర ఇవ్వాలని, వెంటనే ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
కొనుగోళ్లలో జాప్యం చేస్తున్న ప్రభుత్వం..
మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు పంట పండించి మార్కెట్‌కు తీసుకువస్తే ప్రభుత్వం సరైన విధంగా కొనుగోళ్లు చేయడం లేదని ఫైర్ అయ్యారు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోతున్నారని పేర్కొన్నారు. మార్కెట్లో ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల నుంచి మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయాలి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో మంచి వ్యవస్థ ఉండేదని జీవన్‌రెడ్డి ప్రస్తావించారు. మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి మొక్కజొన్నను కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. అలాగే గత పదేళ్లలో కూడా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిగినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ సర్కార్‌లో ప్రస్తుతం ఆ విధానం సరిగా అమలు కావట్లేదని విమర్శించారు. ప్రభుత్వం మళ్లీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభిస్తే రైతులకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.
తీవ్ర నష్టాల్లో మొక్కజొన్న రైతులు..
జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు జరుగుతుందని జీవన్‌రెడ్డి తెలిపారు. అయితే ఈసారి పంటకు సరైన ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. పంటను పండించడానికి రైతులు ఎరువులు, విత్తనాలు, నీటి ఖర్చుల కోసం అప్పులు చేసి సాగు చేస్తారని, కానీ మార్కెట్లో ధరలు తక్కువగా ఉండటంతో వారికి పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రైతులు తమ పంటను నిల్వ చేయలేక తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
మద్దతు ధర ఇవ్వాలి..
ప్రభుత్వం మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పండించిన పంటకు కనీస ధర లభించకపోతే రైతన్నలు ఆర్థికంగా కుంగిపోతారని తెలిపారు. అన్నదాతల పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతన్నల నుంచి నేరుగా మొక్కజొన్న కొనాలని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News