పరాభవం మన దేశానికి కాదు.. దేశద్రోహులకు మాత్రమే: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Mar 19 , 2026 | 03:05 PM
జీవితం షడ్రుచుల సమ్మేళనమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఐక్యతతోనే సవాళ్లను జయించాలని పేర్కొన్నారు.
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జీవితం షడ్రుచుల సమ్మేళనమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. ఐక్యతతోనే సవాళ్లను జయించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘పరాభవ నామ సంవత్సర’ ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు పంచాంగం వినిపించారు. రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ కిషన్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు.
శత్రువులకు, దేశద్రోహులకు పరాభవం..
పరాభవ నామ సంవత్సరంలో 'పరాభవం' అనే పదం మన దేశానికి కానీ, మన ప్రజలకు కానీ వర్తించదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ పరాభవం కేవలం మన దేశ ఎదుగుదలను ఓర్వలేని శత్రువులకు, దేశద్రోహులకు మాత్రమేననే విషయం మనం గుర్తించాలని అన్నారు. భారతదేశం పుణ్యభూమి, పవిత్రమైన దేశమని చెప్పుకొచ్చారు. ఈ నూతన సంవత్సరం మనందరికీ శుభ ఫలితాలనే అందించబోతోందని అన్నారు. పండితులు వివరించిన పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది దేశానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు పుష్కలంగా పండుతాయని వివరించారు. ప్రజలందరూ ఎలాంటి సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో జీవించబోతున్నారన్నారు. ఒకవేళ ఏవైనా సవాళ్లు ఎదురైనా, వాటిని సమర్థవంతంగా అధిగమించే శక్తి మనకు ఉందని తెలిపారు.
పలు దేశాలు శాంతిభద్రతల సమస్యలతో సతమతం..
ప్రపంచంలోని అనేక దేశాలు నేడు యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, శాంతిభద్రతల సమస్యలతో సతమతమవుతున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు. కానీ, భారతదేశం మాత్రం ప్రధానమంత్రి నరేంద్రమోదీ శక్తిమంతమైన నాయకత్వంలో అభివృద్ధి పథంలో నిరంతరం దూసుకుపోతోందని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలు ఐక్యంగా నిలబడి, ఏ సమస్యనైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారని.. ఇది మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మన జీవితానికి ప్రతీక అన్నారు.
అవన్నీ కలగలిసి ఉండటమే జీవితం..
సుఖదు:ఖాలు, కష్టనష్టాలు అన్నీ కలగలిసి ఉండటమే జీవితమని కిషన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. వాటన్నింటినీ ఐక్యతతో, సహనంతో ఎదుర్కోవడమే ఉగాది మనకు ఇచ్చే గొప్ప సందేశమని తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో భారతదేశానికి మరింత అభివృద్ధి, శాంతి, సుభిక్షం కలగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నిన్ను చంపేస్తాం.. రాజాసింగ్‌కు ఆగంతకుల బెదిరింపు..
హైదరాబాద్‌లో తమ్ముడి రాక్షసత్వం.. అక్కను హత్య చేసి.. ఆపై దారుణంగా..
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు...
Read Latest Telangana News And AP News And International News And Telugu News