బాసర గోదావరిలో గల్లంతైన ముగ్గురి మృతదేహాల వెలికితీత
ABN , Publish Date - Jun 09 , 2026 | 06:39 PM
నిర్మల్ జిల్లా బాసరలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు గోదావరి నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. తాజాగా.. వారి మృతదేహాలను వెలికితీశారు.
నిర్మల్ జిల్లా, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): నిర్మల్ జిల్లా బాసరలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తూ ఈరోజు (మంగళవారం) గల్లంతైన విషయం తెలిసిందే. తాజాగా.. వారి మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని కాచిగూడ చప్పల్ బజార్ ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం ఇవాళ వచ్చారు. దర్శనానికి ముందు గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తుండగా ముగ్గురు సోదరులు నీటిలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లతో రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. కొన్ని గంటల పాటు గాలించాక.. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు గజ ఈతగాళ్లు. మృతులను చెందిన చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేశ్ కుమార్ (31)గా గుర్తించారు. ముగ్గురూ సొంత అన్నదమ్ములేనని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఒకేసారి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన బాసర, కాచిగూడలో తీవ్ర విషాద ఛాయలు నింపగా, స్థానికులను కూడా కలచివేసింది. గోదావరి నదిలో స్నానాలు చేసే సమయంలో భక్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లోతైన ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News