కరవు ప్రభావిత ప్రాంతాల్లో పంట రుణాలను రీషెడ్యూలింగ్ చేయాలి: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:54 AM
రైతులను ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో పంట రుణాలను రీషెడ్యూలింగ్ చేయాలని ఆజ్ఞాపించారు.
హైదరాబాద్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రైతులను ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Telangana Minister Tummala Nageswara Rao).. అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరవు ప్రభావిత ప్రాంతాల్లో పంట రుణాలను రీషెడ్యూలింగ్ చేయాలని ఆజ్ఞాపించారు. ఈరోజు (మంగళవారం) హైదరాబాద్‌లో ప్రత్యేక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. ప్రజాభవన్‌లో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఖరీఫ్–2026 కరవు పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. కరవు ప్రభావిత రైతులకు ఉపశమన చర్యలపై బ్యాంకర్లతో సమీక్షించారు. రైతులకు రుణాలు, ఆర్థిక సహకారంపై చర్చించారు. అనంతరం సెప్టెంబర్ 2026 త్రైమాసికానికి 51వ SLBC సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించి అధికారులతో సమీక్షించారు.
రబీ సీజన్‌కు తక్షణమే పంట రుణాలను మంజూరు చేయాలి..
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణాల రీస్ట్రక్చరింగ్ చేపట్టాలని సూచించారు. రబీ సీజన్‌కు తక్షణమే పంట రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. రబీ పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.38,268 కోట్లుగా అంచనా వేశామని అన్నారు. రైతులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా బ్యాంకర్లే ముందుకు రావాలని సూచించారు. రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల బోర్లలో నీరు అడుగంటిందని చెప్పుకొచ్చారు. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపైన భూగర్భ జలాలు పతనమయ్యాయని వివరించారు. డ్రిప్, స్ప్రింక్లర్ సాగుకు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు.
సకాలంలో రుణాలు ఇవ్వాలి..
పప్పు, నూనెగింజలు, ఉద్యాన పంటలకు ఆర్థిక చేయూత ఇస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు బ్యాంకులు రుణాలు అందించాలని సూచించారు. పాడి, పౌల్ట్రీ, పశుపోషణ రంగాలకు రుణాలు పెంచాలని అన్నారు. ఎఫ్‌పీఓలు, మహిళా సంఘాలకు సకాలంలో రుణాలు ఇవ్వాలని నిర్దేశించారు. అన్నదాతల సంక్షేమం ప్రభుత్వంతో పాటు బ్యాంకుల ఉమ్మడి బాధ్యత అని చెప్పుకొచ్చారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ రైతులకు అండగా నిలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖర్గే Vs బీజేపీ .. దీపావళి శుభాకాంక్షలపై రాజకీయ వివాదం
క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. 679 బ్రాండ్ల ధరల తగ్గింపు
ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News