Share News

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:04 PM

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు
Minister Ponnam Prabhakar

హైదరాబాద్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిందని ప్రస్తావించారు. ఆర్టీసీ ప్రతినిధులంతా ఆ కమిటీకి కార్మికుల సమస్యలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తాను అధికారుల దగ్గర చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు.


ఉద్యోగులుగా మీరు.. ప్రభుత్వంగా తాము కలిసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఎలాంటి భేషజాలకు పోకుండా అధికారుల కమిటీకి ఉద్యోగుల సమస్యలు విన్నవించాలని సూచించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

మరోవైపు.. టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను పరిశీలించడానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓఎంఎస్ నంబర్ 66ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) ఉద్యోగుల నుంచి, వారి సేవా నిబంధనలు, సంబంధిత విషయాలపై పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. ఈ వినతులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను పరిశీలించి, తగిన సిఫార్సులను సూచించడానికి ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.


ఈ కమిటీలో ఉన్న వారు వీరే..

  • కమిటీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రహదారులు & భవనాల శాఖ - చైర్మన్

  • ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ - సభ్యుడు

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ - సభ్యుడు

  • వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్ఆర్టీసీ - సభ్యుడు, కన్వీనర్ ఈ కమిటీలో ఉన్నారు.

    ఈ కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి, ఈ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి నాలుగు వారాల వ్యవధిలోగా నివేదికను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌‌రెడ్డి

నాకు శాపాలు పెడతారా.. కాంగ్రెస్ సర్కార్‌పై కేసీఆర్ ధ్వజం

నటి అనసూయపై అసభ్యకర పోస్టులు.. నిందితుడి అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 21 , 2026 | 04:25 PM