Share News

గురుకుల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు..

ABN , Publish Date - Jun 11 , 2026 | 09:00 PM

తెలంగాణ గురుకుల విద్యావ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది. టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

గురుకుల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు..
Telangana Government

హైదరాబాద్, జూన్11, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గురుకుల విద్యావ్యవస్థలో మరో కీలక ముందడుగు పడింది. టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అణగారిన వర్గాల విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ సమావేశంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు యూజీసీ వేతన స్కేలు అమలు దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే గురుకుల డిగ్రీ కళాశాలల నిర్వహణ కోసం ప్రత్యేక పరిపాలనా విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు న్యాక్ (NAAC) గుర్తింపు సాధన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సహాయం..

విదేశీ విద్యను అభ్యసించేందుకు వెళ్లే ఎస్సీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా మరో 9 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణ అందించనున్నారు. వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా 9వ తరగతి నుంచే నీట్, జేఈఈ కోచింగ్ అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.


గురుకుల ఫార్మసీ కళాశాల స్థాపనకు ఆమోదం..

హైదరాబాద్‌లో గురుకుల ఫార్మసీ కళాశాల స్థాపనకు ఆమోదం లభించింది. అలాగే పార్ట్‌టైమ్ అధ్యాపకుల పారితోషికాల పెంపునకు కూడా టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆమోదం తెలిపింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ‘ఫోన్ మిత్ర’ అనే ప్రత్యేక సేవను అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని గురుకులాల్లో ఉమ్మడి పోషకాహార మెనూను అమలు చేయాలని నిర్ణయించారు. విద్యతో పాటు క్రీడలు, వృత్తి విద్యకు కూడా మరింత ప్రాధాన్యం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలోని 133 గురుకుల విద్యాసంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణంపై తీర్మానం ఆమోదించారు. దీనివల్ల విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా వాతావరణం కల్పించే అవకాశం ఏర్పడనుంది.


విద్యాతోనే సామాజిక సాధికారత: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

విద్యాతోనే సామాజిక సాధికారత సాధ్యమవుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సీఎంరేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో తెలంగాణ గురుకులాలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 09:08 PM