Share News

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ

ABN , Publish Date - Jun 10 , 2026 | 08:37 PM

గత 12 ఏళ్ల నుంచి దేశానికి పట్టిన కాంగ్రెస్‌ పీడ విరగడైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో వైఫల్యాలను తాము సరిదిద్దుతున్నామని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ
PM Narendra Modi

ఢిల్లీ, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): గత 12 ఏళ్ల నుంచి దేశానికి పట్టిన కాంగ్రెస్‌ పీడ విరగడైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో వైఫల్యాలను తాము సరిదిద్దుతున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ తన వైఫల్యాలను హిందువులపై నెట్టిందని ధ్వజమెత్తారు. రూ.వేల కోట్ల కుంభకోణాలకు కాంగ్రెస్‌ పాల్పడిందని ఆగ్రహించారు. కాంగ్రెస్‌ పాలనలో వృద్ధిరేటు దారుణంగా ఉందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని మండిపడ్డారు. ఈరోజు (బుధవారం) ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సుకు ప్రధాని మోదీ హాజరై ప్రసంగించారు.


కాంగ్రెస్‌ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించాం..

కాంగ్రెస్‌ ఇనుప సంకెళ్ల నుంచి దేశాన్ని రక్షించామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. అవినీతి రహితంగా ఎన్డీఏ పాలన సాగుతోందని స్పష్టం చేశారు. ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం దక్కడం తన అదృష్టమని తెలిపారు. ఇది తనకు అద్భుతమైన క్షణమని వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని ప్రస్తావించారు. దేశ ప్రజలే తనకు దేవుళ్లు అని ఉద్ఘాటించారు. ఎన్డీఏలో ప్రతి పార్టీకి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. తనను అభినందిస్తూ ఎన్డీఏ నేతలు తీర్మానం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.


అధికారాన్ని సేవగానే భావించా..

అధికారాన్ని సేవగానే భావించానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తమ హయాంలో స్థిరమైన పాలనతో అభివృద్ధి వేగవంతం అయిందని వెల్లడించారు. 2014కి ముందు దేశంలో ఎంతో అస్థిరత ఉందని తెలిపారు. 2014 తర్వాత దేశ రూపురేఖల్లో అనేక మార్పులు తీసుకువచ్చామని ప్రస్తావించారు. ఎన్డీఏపై దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందని అన్నారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని ఉద్ఘాటించారు. అన్నివర్గాల ప్రజల ఆశలకు అనుగుణంగా నడుస్తున్నామని పేర్కొన్నారు. గతంలో దశాబ్దాలపాటు జరిగే అభివృద్ధి.. ఇప్పుడు కేవలం నెలల వ్యవధిలోనే జరుగుతోందని వివరించారు.


వికసిత్‌ భారత్‌లో అందరూ భాగస్వాములయ్యారు..

తమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఆదరించారని ప్రధాని మోదీ తెలిపారు. వికసిత్‌ భారత్‌లో అందరూ భాగస్వాములయ్యారని వెల్లడించారు. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామని చెప్పారు. ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్యను 25 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచామని అన్నారు. కరోనా లాంటి సంక్షోభాన్ని అధిగమించామని ఉద్ఘాటించారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. తాము లెక్కలు మాత్రమే చెప్పడం లేదని.. ఆచరణలో చేసి చూపించామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పాలసీలు ఉంటాయని వివరించారు. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. భారత్‌లో 7.7శాతం వృద్ధి రేటు ఉందని పేర్కొన్నారు.


సామాన్యులపై భారం తగ్గించేందుకు కృషి చేస్తున్నాం..

సామాన్యులపై భారం తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వృద్ధిరేటు కంటే ఎన్డీఏ హయాంలోని 12 ఏళ్లలో వృద్ధిరేటు తేలిపోయిందని అన్నారు. దేశంలో మావోయిస్టులను అంతం చేశామని తెలిపారు. నేషన్‌ ఫస్ట్‌ నినాదంతో పనిచేస్తున్నామని వివరించారు. దేశ భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలకూ కూడా వెనుకాడమని చెప్పారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌ చట్టం తీసుకువచ్చామని ప్రస్తావించారు. ఆర్టికల్‌ నంబర్- 370ని రద్దు చేశామని అన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామని చెప్పుకొచ్చారు. తనకు పార్టీ కంటే.. దేశ ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. తమది లెక్కల ప్రభుత్వం కాదని.. ఆచరణాత్మక ప్రభుత్వమని ఉద్ఘాటించారు.


డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించాం..

దేశంలో డిజిటల్‌ పేమెంట్లను ప్రోత్సహించామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్‌వైపు చూస్తోందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా.. భారత్‌ మారడానికి మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని వివరించారు. విదేశాలపై ఆధారపడటం తగ్గించుకోవాలని సూచించారు. మేడ్‌ ఇన్‌ ఇండియా నినాదం సాకారమవుతోందని అన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకలు తయారు చేస్తున్నామని తెలిపారు. అణుఇంధన ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని సూచించారు. డేటా సెంటర్ల హబ్‌గా భారత్‌ మారుతోందని వ్యాఖ్యానించారు. 500 గిగావాట్ల ఇంధన లక్ష్యాన్ని సాధించాలని చెప్పుకొచ్చారు. సెమీకండక్టర్లు, క్రిటికల్‌ మినరల్స్‌పై దృష్టిపెట్టామని తెలిపారు. ప్రపంచం కంటే ఒకడుగు మనమే ముందుండాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 09:26 PM