Share News

డీలిమిటేషన్‌‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Apr 14 , 2026 | 07:03 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

డీలిమిటేషన్‌‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి:  సీఎం రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాల ద్వారానే నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశం కావడంతో బాధ్యతాయుతంగా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. ప్రస్తుతం మహిళా రిజర్వేషన్, పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని, అవి పూర్తిగా వేర్వేరు విషయాలని స్పష్టం చేశారు.


మహిళల రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు..

మహిళల రిజర్వేషన్ బిల్లుకు భారత జాతీయ కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలోనే 33 శాతం మహిళల రిజర్వేషన్‌ను యథాతథంగా వెంటనే అమలు చేయాలని సూచించారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా అమలు చేయాలని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కేవలం చట్టపరమైన మార్పుకాదని, అది ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అవసరమని పేర్కొన్నారు. పునర్విభజనకు సంబంధించి గతంలో కూడా సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మారుస్తూ డీలిమిటేషన్ నిర్వహించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపారు. లోక్‌సభ సీట్లను 850కు పెంచే ప్రతిపాదన అసలైన వివాదాస్పద అంశమని పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి వాటిని కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఇవ్వటంతో పాటు, సీట్ల సంఖ్య పెంపు లేకుండా డీలిమిటేషన్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.


లోక్‌సభ సీట్ల పెంపునకు దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవు..

జనాభా దామాషా ప్రకారం లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రకంగా అమలు చేస్తే దేశంలో తలెత్తబోయే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1970 నుంచి దేశం జనాభా నియంత్రణ విధానంపై దృష్టి పెట్టినప్పటికీ, రాష్ట్రాల వారీగా జనాభా నియంత్రణ అమలు జరిగిన తీరు భిన్నంగా ఉందని అన్నారు. జనాభాలో తేడాలతో జాతీయ ఐక్యతపై ప్రభావం పడే ప్రమాదాన్ని గుర్తించి, ఇందిరా గాంధీ, అటల్ బిహారి వాజ్‌పేయి వంటి నాయకులు ఈ అంశాన్ని ఒక్కోసారి 25 సంవత్సరాల పాటు వాయిదా వేసినట్లు తెలిపారు. ఆర్థిక సహకారం, సామాజిక, మానవ అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ పద్ధతిలో సీట్ల పెంపు చేస్తే దేశ ఫెడరల్ సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని ప్రాంతాల సమాన ప్రాతినిధ్యం దేశానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు.


ఆ రాష్ట్రాలకు నష్టం..

సీట్ల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విశ్లేషించలేదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు దశాబ్దాలుగా జనాభా స్థిరీకరణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయని తెలిపారు. ఇవన్నీ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోతాయని, రాజకీయంగా బలహీనపడే పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు. పోరాటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా, రాజకీయ అసమతుల్యతకు దారి తీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీలో ఇప్పటికే పక్షపాతం, వివక్ష ఉన్నట్లు తెలిపారు. బిహార్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందుతుంటే, తెలంగాణకు తక్కువ నిధులు వస్తున్నాయని ఉదాహరణగా చెప్పారు. ఇది దక్షిణాది - ఉత్తరాది అసమానతలకు సంకేతమని పేర్కొన్నారు. నిధుల వివక్షకు అదనంగా ఇప్పుడు సీట్ల పెంపు కారణంగా రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించినప్పటికీ, పార్లమెంట్‌లో వారి ప్రాధాన్యం తగ్గిపోతుందని, జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది - మధ్య ప్రాంత రాష్ట్రాలు లాభపడతాయని వెల్లడించారు.


అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా సీట్లను కేటాయించాలి..

హైబ్రిడ్ మోడల్ ప్రకారం, కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ఈ పద్ధతిలో, మిగిలిన సగాన్ని రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (GSDP), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా, మన ఆలోచనలకు తలుపులు తెరిచి కొత్త భావనలు స్వీకరిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రక్రియ అందరికీ న్యాయంగా, ఆమోదయోగ్యంగా ఉండే ఉత్తమ పరిష్కారాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. హైబ్రిడ్ మోడల్ ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతో పాటు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందని అన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని, ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఏకత్వాన్ని బలోపేతం చేసేలా ఉండాలని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డీలిమిటేషన్‌‌తో ఆ రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం: సీఎం రేవంత్‌ రెడ్డి

లవ్ జిహాద్ కేసుపై బండి సంజయ్ ఘాటు స్పందన

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా.. అడ్వకేట్‌కు డ్రంకెన్ టెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 07:42 PM