Share News

CM Revanth Reddy: అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్

ABN , Publish Date - Jan 03 , 2026 | 08:05 PM

కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరోరోజు చర్చ పెట్టాలని అనుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయన్ను కోరుతున్నానని అన్నారు..

CM Revanth Reddy: అసెంబ్లీలో తేల్చుకుందాం రండి.. బీఆర్ఎస్ నేతలకు సీఎం సవాల్
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాకుండా గులాబీ పార్టీ నేతలు తప్పించుకుతిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బహిరంగ సభల్లో మాట్లాడటం కాదని.. సభకు రండి నిజాలు ఏంటో తేలుద్దామని సవాల్ విసిరారు. అసెంబ్లీలో కృష్ణా నది జలాలపై చర్చ పెట్టమని తాము అడగలేదని ప్రస్తావించారు. బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ అడిగారని చెప్పుకొచ్చారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కృష్ణా నదీ జలాలపై చర్చిస్తున్నామని స్పష్టం చేశారు. ఇవాళ(శనివారం) అసెంబ్లీలో ‘నీళ్లు - నిజాలు’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి.


కేసీఆర్ సభకు ఎందుకు రాలేదో కారణమే లేదని అన్నారు. హరీశ్‌రావుకు మాట్లాడే అవకాశాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చారని.. అయినా తాము సభకు రామని వెళ్లిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని తమను కోరారని.. అయితే మీ బట్టలు ఊడదీస్తామని ఒకరు, తోలు తీస్తామని మరొకరు మాట్లాడారని.. ఇప్పుడేమో కుంటిసాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సభకు వచ్చి చర్చలో పాల్గొంటే ఎవరి బట్టలు ఎవరు ఊడదీయాలో ప్రజలే తేల్చేవారని అన్నారు. ప్రాజెక్టులపై నిలదీస్తామన్న కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నల వర్షం కురిపించారు సీఎం రేవంత్‌రెడ్డి.


సభకు వచ్చి కేసీఆర్ దగ్గర ఉన్న సమాచారం ప్రభుత్వానికి ఇస్తారనుకున్నామని.. కానీ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో కారణం చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ సూచనలు ఇస్తే తీసుకుందామని తాము అనుకున్నామని తెలిపారు. కృష్ణానీటిపై ఒకరోజు, గోదావరి నీటిపై మరో రోజు చర్చ పెట్టాలని అనుకున్నామని చెప్పారు. రెండేళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సభకు వచ్చి కేసీఆర్ అనుభవాలు తమతో పంచుకోవాలని తాను పదేపదే ఆయన్ను కోరుతున్నామని అన్నారు. గతంలో మాజీ మంత్రి జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పోషించిన పాత్ర పోషించాలని తాము కోరామని తెలిపారు. జానారెడ్డి, భట్టిలను ఆనాడు అవమానించినా భరించి సభకు వచ్చి సలహాలు ఇచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండ.. అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన భట్టి

తెలంగాణలో అభివృద్ధి జాడేది.. కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 03 , 2026 | 09:16 PM