Share News

ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:54 PM

ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కబ్జాలతో ప్రజలకు సమస్యలు రాకూడదనే హైడ్రా తీసుకువచ్చామని ప్రస్తావించారు.

 ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
Telangana CM Revanth Reddy

రంగారెడ్డి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) హెచ్చరించారు. కబ్జాలతో ప్రజలకు సమస్యలు రాకూడదనే హైడ్రా తీసుకువచ్చామని ప్రస్తావించారు. హైడ్రాను ఒక భూతంలా కొందరు చూపెడుతున్నారని ధ్వజమెత్తారు. హైడ్రా పేదల జోలికి వెళ్లదని.. కబ్జాదారుల భరతం పడుతుందని స్పష్టం చేశారు. గుర్రంగూడ ఎకో పార్క్‌ను కబ్జా చేయాలని కొంతమంది చూశారని ఫైర్ అయ్యారు. వనస్థలిపురంలో దేవుడి భూములనూ కూడా కబ్జా పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం..

ఈరోజు(గురువారం) గుర్రంగూడ ఎకో పార్క్‌లో వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. హరిత నిధి ద్వారా నాగలింగం మొక్కను ముఖ్యమంత్రి నాటారు. రోబోటిక్‌ ఏనుగును ఆవిష్కరించారు. ఈ క్రమంలో గుర్రంగూడ ఎకో పార్క్‌ నమూనాను అటవీ అధికారులు.. సీఎంకి వివరించారు. ఎకో పార్క్‌లో రూ.35.50 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.17.84 కోట్లతో అభివృద్ధి పనులని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 2018లో కొందరి కుట్ర వల్ల కొడంగల్‌లో ఓడిపోయానని చెప్పుకొచ్చారు. ఇక తాను ఏమీ చేయలేనని కొందరు భావించారని అన్నారు. మల్కాజ్‌గిరి ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని తెలిపారు.


నన్ను ఓడించాలని కొందరు కుట్రలు పన్నారు..

ప్రశ్నించే గొంతు ఉండాలని నాడు ఎంపీగా తనను గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు. తనను ఓడించాలని కొందరు ఎన్నో కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. ఇక్కడి ప్రజల అభిమానమే తనను ముఖ్యమంత్రిగా నిలబెట్టిందని వివరించారు. ఎల్బీనగర్‌ ప్రజలు తనకు 30 వేలకుపైగా ఓట్ల మెజారిటీ ఇచ్చారని అన్నారు. తన సొంతూరు కొండారెడ్డిపల్లి లాంటిదే తనకు ఎల్బీనగర్‌ అని అభివర్ణించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎల్బీనగర్‌ అభివృద్ధిని పట్టించుకోలేదని మండిపడ్డారు. సీఎంగా ఎల్బీనగర్‌ సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని మాటిచ్చారు. రంగారెడ్డి జిల్లాకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మించామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఫ్యూచర్‌ లేనివాళ్లు ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తామంటున్నారు..

కాలుష్య కోరల్లో చిక్కుకుని ఢిల్లీ ప్రజలు బాధపడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. మన హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రావొద్దనే మొక్కల పెంపకాన్ని ప్రోత్సాహిస్తున్నామని వివరించారు. మూసీ పునరుజ్జీవం చేస్తామంటే కొందరు అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. మూసీ ఒడ్డున నివసిస్తున్న ప్రజలను తరలించి.. అభివృద్ధి చేస్తామంటే కొందరు మోకాలడ్డుతున్నారని మండిపడ్డారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేశామని స్పష్టం చేశారు. ఫ్యూచర్‌ సిటీ కడతామంటే మళ్లీ ఫార్మా కంపెనీలు తెస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఫ్యూచర్‌ లేనివాళ్లు ఫ్యూచర్‌ సిటీ రద్దు చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. ముందు సిద్దిపేట గెలిచిరండి.. ఆ తర్వాత రద్దుపై మాట్లాడదామని హితవు పలికారు. 60 శాతం గ్రీనరీ పెంచుతామంటే NGTలో కేసులు వేశారని సీఎం రేవంత్‌‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క

అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 07:20 PM