సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదు: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:18 PM
12 ఏళ్ల తర్వాత కేటీఆర్‌కు సింగరేణి గుర్తుకు వచ్చిందా అని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు.
హైదరాబాద్, అక్టోబర్ 15: సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 12 ఏళ్ల తర్వాత కేటీఆర్‌కు సింగరేణి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. సింగరేణిని బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. సింగరేణి ప్రతిష్ఠ దెబ్బతిసే విధంగా కేటీఆర్ వాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింగరేణి టెండర్లు పారదర్శకంగా జరుగుతున్నాయని.. అందుకే కొన్ని శక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. సింగరేణికి బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల బకాయిలు పెట్టిందని తెలిపారు. సింగరేణి సంస్థను గత పదేళ్లు నడిపింది కేటీఆర్ కుటుంబ సభ్యులు కాదా అని నిలదీశారు. కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ మానుకో అంటూ హితవుపలికారు.
బీఆర్ఎస్ విధానాల వల్లే సింగరేణిలో ఉత్పత్తి తగ్గిందని మంత్రి విమర్శించారు. సింగరేణి కార్మికులకు గత పదేళ్లలో ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని బీఆర్ఎస్ చూసిందన్నారు. తాడిచర్ల బ్లాక్‌ను ప్రైవేటు సంస్థకు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ... ఎవరైనా చేస్తా అంటే ఊరుకోమని హెచ్చరించారు. సింగరేణి బోగ్గు నాణ్యతకు అనుగుణంగా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు.
జీ9 బొగ్గును సింగరేణి సరఫరా చేస్తుందని శ్రీధర్ బాబు అన్నారు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. యాదాద్రి థర్మల్ పవర్‌కు ప్రతి సంవత్సరం 14 మిలియన్ బొగ్గు అవసరమని.. దానికి అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తి ఎందుకు పెంచలేదని నిలదీశారు. కొత్త గణులపై ఎందుకు దృష్టి సారించలేదన్నారు. ఇప్పుడు అదే సమస్యగా మారి యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు ఇబ్బందిగా మారిందని.. తమ ప్రభుత్వం వచ్చాక నైనీ కోల్ బ్లాక్ నుంచి యాదాద్రి ప్లాంట్‌కు బొగ్గు సరఫరా చేస్తున్నామన్నారు. బొగ్గు ఉత్పత్తి నుంచి సరఫరా వరకు సాంకేతిక పర్యావేక్షణ ఉందని తెలిపారు.
బొగ్గు మాయం అనేది కేవలం రాజకీయ ఆరోపణే అని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన టెండర్ల విధానమే ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పారు. అప్పుడు తప్పు కానిది ఇప్పుడు ఎలా అవుతుందని ప్రశ్నించారు. గత పదేళ్లు సింగరేణి కాంట్రాక్టులన్నీ బీఆర్ఎస్ నేతల అనుచరులకే కట్టబెట్టారని.. కళ్లున్నా చూడలేని కబోధిలా కేటీఆర్ మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులే లేరని కేసీఆర్ ప్రకటించారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులకు దసరా బోనస్ ఇస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలు పెంచాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. మహిళల భాగస్వామ్యం కీలకం: రాష్ట్రపతి ముర్ము
Read Latest Telangana News And Telugu News