విజయవాడలో జాతీయ సరస్ మేళా ప్రారంభం.. స్టాల్స్‌ను సందర్శించిన రాష్ట్రపతి
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:12 PM
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా ప్రారంభమైంది. ఈరోజు ఉదయం సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు.
విజయవాడ, అక్టోబర్ 15: నగరంలోని పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళా ప్రారంభమైంది. ఈరోజు(గురువారం) ఉదయం సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రాష్ట్రపతి సందర్శించారు. మహిళల ప్రతిభ, మేధస్సును ప్రత్యేకంగా అభినందించారు. సరస్ మేళాలలో దాదాపు 650 స్టాల్స్‌లో హస్తకళలు, చేతి వృత్తులు, ఇతర కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు.
జాతీయ సరస్ మేళా - 2026 కార్యక్రమం నేటి నుంచి ఈ నెల 31 వరకు దాదాపు 14 రోజుల పాటు జరగనుంది. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు దేశ, విదేశీ స్థాయిలో గుర్తింపు కల్పించే ఉద్దేశంతో సరస్ మేళాను ఏర్పాటు చేశారు. ‘స్వయం ఏపీ’ బ్రాండ్ పేరుతో డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనకు 650 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ దేశ రాజధాని ఢిల్లీలోనే సరస్ మేళా నిర్వహణ జరుగగా.. తొలిసారిగా ఏపీలో జాతీయ సరస్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏబీఎన్ 17వ వార్షికోత్సవం.. సీఎం చంద్రబాబు విషెస్
దుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం కానుక
Read Latest AP News And Telugu News