Share News

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌.. మహిళల భాగస్వామ్యం కీలకం: రాష్ట్రపతి ముర్ము

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:57 PM

విజయవాడ పున్నమిఘాట్‌లో జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. విజయవాడకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని.. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభించిందన్నారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌.. మహిళల భాగస్వామ్యం కీలకం: రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu

విజయవాడ, అక్టోబర్ 15: పున్నమిఘాట్‌లో జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. విజయవాడకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని.. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభించిందన్నారు. దుర్గాదేవి ఉత్సవాల నేపథ్యంలో పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో భాగంగా ‘లఖ్‌పతి దీదీ’ మేళాను నిర్వహించడం ఒక విశేషమైన కలయికగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణాభివృద్ధి అంటే గ్రామాల వికాసమని చెప్పుకొచ్చారు. మహిళల స్టాళ్లను సందర్శించే అవకాశం దక్కిందని.. వారి ఉత్సాహం, వారి ముఖాల్లోని చిరునవ్వు చూస్తుంటే మహిళలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని స్పష్టమవుతోందన్నారు. ఒకప్పుడు మహిళలు వెనుకబడి ఉండేవారని.. కేవలం కుటుంబ సంరక్షణకే పరిమితమై, ఆర్థికంగా చిన్న చిన్న అవసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండేదని చెప్పుకొచ్చారు. కానీ నేడు మహిళలు సంపూర్ణంగా స్వయం సమృద్ధి సాధించారన్నారు.


ఇతరులకు ఆసరాగా మహిళలు

మహిళలు కేవలం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, ఇతరులకు కూడా ఆసరాగా నిలుస్తున్నారని ముర్ము తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్య సాధనలో మహిళల భాగస్వామ్యం కీలకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన, మహిళల సంకల్పం దేశంలోని ముఖ్యమంత్రులందరి ఉమ్మడి కృషి ఫలితంగా మహిళా సాధికారత ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. 2047 కంటే ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు.


మహిళల భాగస్వామ్యం పెరిగింది

వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని రాష్ట్రపతి వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక, సాంకేతిక సామాజిక సాధికారత దిశగా కొత్త మార్గం లభించిందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు, కుటుంబంలో ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ మహిళల భాగస్వామ్యం పెరిగిందన్నారు. భారతదేశం భిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, వేర్వేరు సంప్రదాయాలు కలిగిన దేశమైనప్పటికీ అంతా ఒక్కటే అని అన్నారు.


గ్రామీణ జీవనోపాధి మిషన్‌‌లో మహిళలకు ప్రాధాన్యం

ప్రస్తుత గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం మంది మహిళలు రాజకీయాల్లో భాగస్వాములవుతున్నారని ద్రౌపది ముర్ము అన్నారు. ఒకప్పుడు బ్యాంకుల వద్దకు వెళ్లడానికి సంకోచించిన మహిళలు, నేడు ఎవరి సాయం లేకుండా స్వయంగా బ్యాంకులకు వెళ్లి తమ పనులను స్వతంత్రంగా చక్కబెట్టుకుంటున్నారని తెలిపారు. అంత్యోదయ సమగ్ర దృక్పథానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలే గ్రామాల రూపురేఖలను మార్చే నాయకత్వాన్ని అందిస్తున్నారని చెప్పారు. భారత ప్రభుత్వం లఖ్‌పతి దీదీ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళా సాధికారతకు ఒక ప్రత్యేకమైన వేగం, దిశానిర్దేశం అందించిందన్నారు.


నైపుణ్యాభివృద్ధిలో కొత్త అవకాశాలు..

డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధనం వంటి ఆధునిక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ, వారికి నైపుణ్యాభివృద్ధిలో కొత్త అవకాశాలు లభిస్తున్నాయని ముర్ము అన్నారు. గవర్నర్‌గా ఉన్న సమయంలో అక్కడి గ్రామీణ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందన్నారు. ఆ మహిళలు ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తూ ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం పొందుతున్నారు, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అనే వివరాలను స్వయంగా ల్యాప్‌టాప్‌లలో నమోదు చేసుకుంటూ పనులు చేసుకునేవారని తెలిపారు. ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలని, కుటుంబంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి...

అబ్దుల్ కలాం జయంతి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు

మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలు పెంచాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2026 | 02:15 PM