Share News

అబ్దుల్ కలాం జయంతి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు

ABN , Publish Date - Oct 15 , 2026 | 10:18 AM

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులర్పించారు.

అబ్దుల్ కలాం జయంతి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు
APJ Abdul Kalam birth anniversary

అమరావతి, అక్టోబర్ 15: మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులర్పించారు. అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి శిఖరమని సీఎం కొనియాడారు. అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు. దేశ అణు, సాంకేతిక రంగాలకు సరికొత్త మార్గనిర్దేశనం చేసిన దార్శనికుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని తెలిపారు. ఆయన జయంతి సందర్భంగా ఆ మానవతావాది దేశ, సమాజ సేవలను స్మరించుకుందాం అంటూ ఎక్స్‌లో సీఎం పోస్ట్ చేశారు.


అబ్దుల్ కలాం వారసత్వాన్ని గౌరవిద్దాం: పవన్ కల్యాణ్

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. రామేశ్వరంలోని ఒక నిరాడంబర కుటుంబం నుంచి ఎదిగి, భారతదేశపు అత్యంత గౌరవనీయమైన శాస్త్రీయ నాయకులలో ఒకరిగా ప్రజల ఆరాధ్య రాష్ట్రపతిగా నిలిచిన దార్శనిక శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వారిని స్మరించుకుందామని అన్నారు. ఆయన ప్రస్థానం విద్య, క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం శక్తికి నిదర్శనమన్నారు. ఒక యువ వార్తాపత్రిక పంపిణీదారుడిగా పనిచేయడం నుంచి భారతదేశపు స్వదేశీ ఎస్ఎల్వి-III ప్రయోగ వాహనం అభివృద్ధికి నాయకత్వం వహించారన్నారు. అగ్ని, పృథ్వీ క్షిపణి కార్యక్రమాలను ముందుకు నడిపించారన్నారు. పోఖ్రాన్-II కు సహకరించారని, టెక్నాలజీ విజన్ 2020కి మార్గదర్శకుడిగా నిలిచారన్నారు. ఆయన తన జీవితాన్ని భారతదేశపు శాస్త్రీయ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, అభివృద్ధి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడానికి అంకితం చేశారని చెప్పుకొచ్చారు.


సామాన్యమైన ప్రారంభాలు గొప్ప ఆశయాలకు పరిమితి కాదని ఆయన జీవితం గుర్తు చేస్తుందని పవన్ అన్నారు. ఎదురుదెబ్బలు నేర్చుకోవడానికి అవకాశాలుగా మారగలవని, జ్ఞానాన్ని నిజాయితీ, వినయం, సమాజ సేవతో మేళవించడంలోనే నిజమైన విజయం ఉందనడానికి ఆయన జీవితమే ఉదహరణగా చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన భారత్‌పై ఆయనకున్న దార్శనికత, ప్రతి పౌరునికి, యువతకు, ఒక లక్ష్యంతో కలలు కనడానికి, పట్టుదలతో పనిచేయడానికి, దేశ నిర్మాణానికి దోహదపడటానికి ఒక పిలుపుగా నిలుస్తుందని అన్నారు. కలాం జయంతి సందర్భంగా ఆయన ప్రతిబింబించిన విలువలను - శాస్త్రీయ దృక్పథం, ఆత్మనిర్భరత, నిరంతర అభ్యసనం చేద్దామన్నారు. భారత ప్రగతి పట్ల అచంచలమైన నిబద్ధతను పాటిస్తూ అబ్దుల్ కలాం వారసత్వాన్ని గౌరవిద్దామని ఎక్స్‌ వేదికగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


కలాం జీవితం నేటి తరానికి ఆదర్శం: మంత్రి లోకేశ్

మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఘన నివాళులర్పించారు. రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించారని అన్నారు. తన ప్రసంగాలతో అందరిలో స్ఫూర్తి నింపిన కలాం జీవితం నేటి తరానికి ఆదర్శమన్నారు. భారతరత్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను స్మరించుకుందామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2026 | 11:39 AM