డ్వాక్రా సంఘాల టర్నోవర్ను రూ.10 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:09 PM
జాతీయ సరస్ మేళాను విజయవాడలో ఏర్పాటు చేసి ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఢిల్లీ తర్వాత తొలిసారిగా కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడ పెట్టడం నిజంగా సంతోషంగా ఉందన్నారు.
విజయవాడ, అక్టోబర్ 15: నగరంలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జాతీయ సరస్ మేళాను విజయవాడలో ఏర్పాటు చేసి ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలియజేశారు. ఢిల్లీ తర్వాత తొలిసారిగా కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడ పెట్టడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అటు దుర్గమ్మ, ఇటు కృష్ణమ్మ పరవళ్ల చెంతన సరస్ మేళాను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. పేద కుటుంబంలో పుట్టిన ముర్ము ఉపాధ్యాయురాలిగా జీవితం ప్రారంభించారని.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని రాష్ట్రపతి స్థాయికి ఎదిగారన్నారు. సంకల్పంతో ఎదిగిన ముర్ము జీవితం అందరికీ ఆదర్శమని వెల్లడించారు. మహిళలు సంకల్పిస్తే ఎంత ఉన్నత శిఖరాలు అయినా అధిరోహిస్తారని నిరూపించారని తెలిపారు.
మహిళా శక్తిని చాటేందుకు విజయవాడలో తొలిసారి జాతీయ సరస్ మేళా నిర్వహించుకున్నామని సీఎం అన్నారు. 650 స్టాల్స్ మహిళల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గ్రామీణ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ఈ మేళా ఉద్దేశమన్నారు. కొత్త వ్యాపారాలకు అవకాశం సృష్టించాలని అన్నారు. మహిళలు ఎదిగితే ఆ కుటుంబం, ఆ రాష్ట్రం, ఆ దేశం ఎదుగుతుందన్నారు. నేటి ఉత్పత్తులే.. జాతీయ ప్రొడక్టులుగా మారాలని సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆరు కోట్ల మందిని వ్యాపారవేత్తలుగా మార్చడం ఆయన లక్ష్యమన్నారు.
ఉమ్మడి ఏపీలో డ్వాక్రా సంఘాలను ప్రారంభించానని.. అదే ఉద్యమం నేడు దేశవ్యాప్తంగా కొత్త చరిత్ర సృష్టిస్తోందని చంద్రబాబు తెలిపారు. రూ.69 లక్షల కోట్ల లోన్లు తీసుకుంటున్నారని.. డ్వాక్రా సంఘాల టర్నోవర్ లక్ష కోట్లుగా ఉందన్నారు. త్వరలో పది లక్షల కోట్ల టర్నోవర్ కావాలని ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘాలను పారిశ్రామికవేత్తలుగా మార్చామన్నారు. పది లక్షల మంది ఆడబిడ్డలను త్వరలోనే పారిశ్రామిక వేత్తలుగా చూడబోతున్నామని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్తగా మహిళ ఉండాలనేదే లక్ష్యమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఉత్పత్తులకు మార్కెటింగ్ పెంచుకోవాలని సూచించారు. మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. మహిళల ద్వారానే ఏదైనా ప్రగతి సాధ్యమని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
దుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం కానుక
విజయవాడలో జాతీయ సరస్ మేళా ప్రారంభం.. స్టాల్స్ను సందర్శించిన రాష్ట్రపతి
Read Latest AP News And Telugu News