స్పీకర్‌పై తాతా మధు వ్యాఖ్యలు.. మంత్రి సీతక్క కంటతడి
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:17 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క కంటతడి పెట్టారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క కంటతడి పెట్టారు. స్పీకర్‌కు జరిగిన అవమానంపై మంత్రి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు శాసనమండలి సభ్యులు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించారు. స్పీకర్‌పై దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు.
వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి..
వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు. దళిత స్పీకర్‌ను అధ్యక్ష అని అనాల్సి వస్తోందని కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని ఫైర్ అయ్యారు. కేసీఆర్.. గులాబీ పార్టీ సభ్యులకు ఏం సంస్కారం నేర్పి అసెంబ్లీకి పంపారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటేనే అహంకారంతో కూడిన పార్టీ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఆధిపత్య భావజాలంతో నడుస్తోందని విమర్శించారు. గతంలో దళిత ఎమ్మెల్యేలను కేసీఆర్ కుటుంబం తిట్టిందని దుయ్యబట్టారు. అనుచిత వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్ అని సెటైర్లు గుప్పించారు.
కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి..
దళితులను లారీలు ఎక్కించి బీఆర్ఎస్ హయాంలో చంపించారని మంత్రి సీతక్క ఆరోపించారు. నిలువెత్తునా బీఆర్ఎస్‌లో దొర అహంకారం, దురాహంకారం ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ డ్రామాలు కావాలి.. కాని ప్రజా సంక్షేమం పట్టదా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యులు సంస్కార హీనంగా మాట్లాడుతూ.. సీఎం సంస్కారంతో మాట్లాడాలని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. స్పీకర్‌కు గులాబీ పార్టీ సభ్యులు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ సభ్యులు కొత్త డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. వెంటనే తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈహెచ్‌ఎస్ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క
అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్
త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News