Share News

కేసీఆర్‌ హయాంలోనే పల్నాడు జీవో

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:08 AM

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులకు నష్టం కలిగించింది కేసీఆర్‌, హరీశ్‌రావులేనని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్‌ఎస్‌ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ హయాంలోనే పల్నాడు జీవో

  • 16.2.2022న జీవో 56 జారీ చేసిన జగన్‌ సర్కారు

  • ప్రకాశం జిల్లాకు నీటి తరలింపునకు జీవో 482 కూడా..

  • అయినా కృష్ణా బోర్డుకు, కేంద్రానికి అభ్యంతరం తెలపలేదు

  • మేం అధికారంలోకి వచ్చిన తర్వాతే అభ్యంతరం తెలిపాం

  • రాష్ట్రానికి 299 టీఎంసీలు చాలని కేసీఆర్‌, హరీశ్‌ చెప్పారు

  • అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు ముందు సంతకాలు చేశారు

  • బ్రిజేష్‌కుమార్‌ తీర్పొచ్చే దాకా ఈ వాటాలే శాశ్వతమంటూ సంతకం చేసి తెలంగాణ ప్రయోజనాల్ని జలసమాధి చేశారు

  • హరీశ్‌ మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు

  • మంత్రి పదవిచ్చినందుకు వైఎస్‌ రుణం తీర్చుకున్నారు

  • మల్యాల, ముచ్చుమర్రికి అనుమతులూ కేసీఆర్‌ పాలనలోనే

  • వాళ్ల పాపాల్ని సరిదిద్దడానికి తల ప్రాణం తోకకు వస్తోంది

  • కేసీఆర్‌కు శాశ్వత రాజకీయ సమాధి కట్టాల్సిందే: సీఎం

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్‌, హరీశ్‌ రావులే. ఒకటి, రెండు కాదు.. అనేక తప్పులు చేసి తెలంగాణ హక్కులు కాలరాసేశారు. ఇన్ని తప్పులు చేసిన కేసీఆర్‌ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం, మళ్లీ అధికారంలోకి వచ్చి మూడో తరానికి కూడా సంపాదించి పెట్టేందుకు నీళ్ల రాజకీయం మొదలుపెట్టారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు ఇంత అన్యాయం చేసిన వారిద్దరినీ ఒక్క ఎన్నికల్లో ఓడిస్తే సరిపోదని, శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు. 2004 నుంచి 2014 దాకా వైఎస్‌కు, మళ్లీ 2019-23 మధ్య జగన్‌కు తెలంగాణ ప్రజల హక్కులను బీఆర్‌ఎస్‌ శాశ్వతంగా తాకట్టు పెట్టిందని విరుచుకుపడ్డారు.


జగన్‌ సీఎంగా ఉండగా 2022 ఫిబ్రవరి 16న పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పథకానికి జీవో నం.56ను విడుదల చేశారని, అప్పట్లో తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ఉన్నారని గుర్తు చేశారు. కేసీఆర్‌, జగన్‌ మధ్య సత్సంబంధాల సమయంలో విందు భోజనాలు చేస్తూ రొయ్యల పులుసు తింటున్నప్పుడు జీవో వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుపై కృష్ణా బోర్డుకు కానీ, కేంద్ర జలశక్తి శాఖకు కానీ కేసీఆర్‌ అభ్యంతరాలు చెప్పలేదని, ఆ జీవో వల్లే సాగర్‌ వద్ద పల్నాడు పథకం పనులు జరుగుతున్నాయని వివరించారు. ఆరోజు ఇచ్చిన అలుసు, అనుమతితోనే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని, 2024లోపే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారని తెలిపారు.


ఈ విషయం తమ ప్రభుత్వం దృష్టికి రాగానే కృష్ణా బోర్డుకు, కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశామని, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి ఉత్తమ్‌ ఫోన్‌ చేసి, అభ్యంతరాలు కూడా తెలిపారని వెల్లడించారు. కృష్ణా జలాల వివాదంపై సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయా సందర్భాల్లో విడుదల చేసిన జీవోలు, ఇతర పత్రాల ప్రతులను ప్రదర్శించారు. కృష్ణా జలాలపై 2015లో తాత్కాలిక ఒప్పందం చేసుకోవడానికి కారణం ఏమిటని నిలదీశారు. ఎందుకు తల వంచావంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పినట్లు వినమని ఏ కాంట్రాక్టర్‌ చెబితే చేశారని ప్రశ్నించారు.


బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ నీటిని పంచే వరకూ ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని నిర్ణయించారని, ట్రైబ్యునల్‌ వేసి ఇప్పటికే 22 ఏళ్లు అయిందని, మరో 20 ఏళ్లు నీళ్లు ఏపీకి వెళుతూనే ఉంటాయని ఆక్షేపించారు. ట్రైబ్యునల్‌లో ఏపీ వాయిదాలు కోరుతుంటే తాము మాత్రం తీర్పు 8 నెలల్లోపు రావాలని పట్టుబడుతున్నామని చెప్పారు. ఈ వివాదంలో ఏ పని చేయడానికైనా కే సీఆర్‌ చేసిన సంతకాలు జఠిలంగా మారాయని, వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఏపీ జల దోపిడికి కేసీఆరే కారణమని, ఈ వాస్తవాలన్నీ అసెంబ్లీలో చెబుదామని అనుకున్నామని, కానీ, కేటీఆర్‌, హరీశ్‌ ఊరూరా తిరుగుతూ టన్నులకొద్దీ అబద్ధాలను పదే పదే చెబుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కులను సమాధి చేసేలా కేసీఆర్‌, హరీశ్‌ రావు చేసిన తప్పులను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..


TG copy.jpgతప్పుల మీద తప్పులు

మొదటి తప్పు : కృష్ణా జలాల్లో 811 టీఎంసీలకు గాను ఏపీకి 512 టీఎంసీలు, రాష్ట్రానికి 299 టీఎంసీలు చాలని ఒప్పుకుని కేసీఆర్‌, హరీశ్‌ రావు సంతకాలు చేశారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉమాభారతి ఉన్నప్పుడు 2015 జూన్‌ 26న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ దారుణం చేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతం తెలంగాణలో 71 శాతం; ఏపీలో 29 శాతం ఉంది. దాని ప్రకారం తెలంగాణకు 575 టీఎంసీల వాటా రావాలి. కానీ, తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ ఆరోజు సంతకం చేశారు. నిజానికి, దానిపై ఏటేటా మాట్లాడుకోవాలి. కానీ, బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చేవరకు ఈ పంపకాలే ఉండేలా 29.1.2020న సంతకాలు చేశారు. తెలంగాణకు మరణ శాసనం రాసేశారు. ఈ మేరకు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాశారు.


రెండో తప్పు.. : పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పనులు ఇప్పుడే మొదలయ్యాయని కేటీఆర్‌, హరీశ్‌ ఊరూరా తిరిగి అబద్ధాలు చెబుతున్నారు. కానీ, మీకో కొత్త విషయం చెబుతాను. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ఒక్కటే కాదు.. ప్రకాశం జిల్లాకు నీటిని తీసుకెళ్లేందుకు కూడా ఏపీ అనుమతులు తెచ్చుకుంది. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా 1.8 టీఎంసీల తాగునీటిని కేంద్ర జలశక్తి మిషన్‌ పథకంతో అనుసంధానం చేసి తీసుకునేందుకు అనుమతి తెచ్చుకుని 16.2.2022న జీవో 56 జారీ చేసింది. అంతేనా.. ప్రకాశం జిల్లాకు 0.22 టీఎంసీలు తరలించేందుకు 24.2.2022న జీవో 482 జారీ చేసింది. అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే. దీనిపైనా కేంద్ర జల శక్తి మిషన్‌కు కానీ, కేంద్రానికి కానీ, కేఆర్‌ఎంబీకి కానీ అభ్యంతరం తెలపలేదు. ఏ ప్రాజెక్టు అయినా రూపకల్పన, అనుమతులు అయ్యాక టెండర్లు పిలవడం, పూర్తి చేయడానికి మూడు, నాలుగేళ్లు పడుతుంది. అప్పటి అనుమతుల ఫలితమే ఇప్పుడు పనులు. ఈ పాపమంతా కేసీఆర్‌, హరీశ్‌లదే.


మూడో తప్పు.. : హరీశ్‌ రావుతోపాటు ఆరుగురు టీఆర్‌ఎస్‌ మంత్రులు వైఎస్‌ క్యాబినెట్‌లో ఉన్నప్పుడు.. నాయిని నర్సింహా రెడ్డి కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమకు నీటిని తీసుకెళ్లే పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. మంత్రివర్గంలో ఆమోదం పొందిన తర్వాత 13.9.2005న జీవో ఇచ్చారు. అప్పట్లో వార్డు మెంబర్‌ కూడా కాని హరీశ్‌ రావును వైఎస్‌ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీనికి గురు దక్షిణగా పోతిరెడ్డిపాడు విస్తరణకు మంత్రివర్గంలో ఉన్న హరీశ్‌ రావు ఆమోదం తెలిపారు. తాను మంత్రిగా ఉండగా పోతిరెడ్డిపాడు జీవో రాలేదని హరీశ్‌ అంటున్నారు. కానీ, 2005 మార్చి 29న శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో పెట్టిన డిమాండ్‌ ఫర్‌ గ్రాంట్స్‌లోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి నీళ్లు తీసుకెళ్తామని స్పష్టంగా ఉంది. 11వ పేజీలో ఉన్న ఆ అంశాన్ని మంత్రివర్గం ఆమోదించింది.


అప్పుడు హరీశ్‌ రావు మంత్రిగా ఉన్నారు. అలాగే, హంద్రీనీవాకు 40 టీఎంసీల నీటిని తరలించడానికి 24.7.2004న జీవో ఇచ్చారు. ఆ తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతలకు అనుమతి ఇచ్చింది కేసీఆరే. నాటి ఏపీ సీఎం జగన్‌ ప్రగతి భవన్‌కు వచ్చి విందు చేసిన తర్వాత.. కేసీఆర్‌ రాయలసీమ రొయ్యల పులుసు తిని అనుమతి ఇచ్చేశారు. జగన్‌కు కేసీఆర్‌ విందు భోజనం పెట్టిన తర్వాతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభమైంది. కేసీఆర్‌ చేసిన మేలును జగన్‌ అప్పట్లో ఏపీ అసెంబ్లీలో కూడా చెప్పారు. ‘కేసీఆర్‌ మంచి మనిషి. ఏపీకి మేలు చేసే దిశగా గోదావరి జలాలను శ్రీశైలం వరకూ తీసుకెళ్లడానికి సహకరించారు’ అని చెప్పారు. కేసీఆర్‌ వాళ్లకు మంచి మనిషి. మనకు ముంచే మనిషి. వైఎస్‌ సీఎంగా ఉండగా మల్యాలకు జీవో ఇస్తే జగన్‌ సీఎంగా ఉండగా ముచ్చుమర్రి జీవో ఇచ్చారు. రాయలసీమ లిఫ్టుకు కూడా 2020లో అక్కడ చంద్రబాబు, ఇక్కడ కేసీఆర్‌ సీఎంగా ఉండగా అనుమతి ఇచ్చేశారు.


నాలుగో తప్పు : తెలంగాణ సీఎంగా పదేళ్లున్న కేసీఆర్‌ కృష్ణా నీటిపై ఆధారపడిన ఎస్‌ఎల్‌బీసీ, డిండి, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి సహా ఏ ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు. ఏపీ మాత్రం 8 ప్రాజెక్టుల్ని పూర్తి చేసేసుకుంది. ఆ పదేళ్లలో ఏపీతో సమంగా తెలంగాణ కూడా ప్రాజెక్టులు కట్టి ఉండే.. ఏపీ ఇంత బరితెగించేది కాదు. ఇన్ని పాపాలు చేసిన కేసీఆర్‌, హరీశ్‌లు కృష్ణా ప్రాజెక్టుల పూర్తికి 10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు.


సాగర్‌ నుంచి చుక్క కూడా పోనీయం: మంత్రి ఉత్తమ్‌

నాగార్జున సాగర్‌ నుంచి చుక్క నీళ్లు కూడా పోనీయమని, ఇంత ఎల్‌నినో కాలంలోనూ సాగర్‌ ఎడమ కాల్వ కింద ఒక్క ఎకరం కూడా నష్టపోకుండా చూసుకున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పల్నాడు తాగునీటి పథకం పనులు తమ దృష్టికి రాగానే కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి, కృష్ణా బోర్డు చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. జూరాల నురచి పాలమూరును, ప్రాణహితపై తుమ్మిడిహెట్టి పూర్తి చేసుంటే గోదావరి, కృష్ణా బేసిన్‌లో సమస్యలు వచ్చేవి కావని, వీటిని సృష్టించింది కేసీఆరేనని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని, తుమ్మిడిహెట్టి పూర్తయినా కాళేశ్వరం బ్యారేజీలను కూడా వాడుకుంటామని వివరించారు.


ఇక, మేడిగడ్డ కుంగుబాటుకు బాంబులు పెట్టడమే కారణమన్న బీఆర్‌ఎస్‌ ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘‘ఆ సమయంలో మేం అధికారంలో లేము. అయినా, భూమి కింద బాంబులు పెట్టి పేల్చితే శకలాలు పైకి లేస్తాయా? భూమిలో కుంగుతాయా? బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు. బ్యారేజీల పునాదుల కింద ఇసుక జారి కుంగిందని ఎన్‌డీఎ్‌సఏ, విజిలెన్స్‌, జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ తేల్చింది’’ అని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల ప్రకారమే కాళేశ్వరం పనులు చేస్తామన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తదితరులు పాల్గొన్నారు.


మెరుగ్గా కృష్ణా నీటి వినియోగం

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లకన్నా మెరుగ్గా ఈ మూడేళ్ల కాలంలో కృష్ణా జలాలను తరలించామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. 2023-24లో 208.7 టీఎంసీలు ఏపీ తీసుకుంటే.. 119 టీఎంసీలే తెలంగాణ వాడుకుందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో 285 టీఎంసీలు, 2025-26లో 268.12 టీఎంసీలు, 2026-27లో ఇప్పటిదాకా 110 టీఎంసీలను వాడుకున్నామని తెలిపారు. కేసీఆర్‌ రాసిన మరణ శాసనం ప్రకారం 34 శాతం నీళ్లే వాడుకోవాలని, కానీ, 45.44 శాతం నీటిని తరలించామని వివరించారు. పదేళ్లలో ‘టెండర్లు పిలవాలే.. పంపులు, లిఫ్టులు కట్టుకోవాలే.. వేల కోట్లు కొల్లగొట్టాల’నే విధానమే ఉందని, తాము అధికారంలోకి వచ్చాకా భూ సేకరణకు ప్రత్యేక అధికారిని పెట్టామని, 34 నెలల్లో 14,519 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు.


అప్పట్లో భూసేకరణ, రైతుల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. రైతులకు పరిహారం ఇవ్వాలనే సోయి, ముంపు గ్రామాలకు రైతులను తరలించాలనే ఆలోచన లేదని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డిని జూరాల నుంచి చేపడితే 22 పంపులు; రూ.35 వేల కోట్లతో పూర్తయ్యేదని, శ్రీశైలంకు మార్చగానే 37 పంపులు అయ్యాయని, అంచనాలు రూ.80 వేల కోట్లకు పెరిగాయని దుయ్యబట్టారు. రెండుసార్లు అధికారం ఇస్తే పది తరాలపాటు సరిపోయేలా సంపాదించారని, ఇప్పుడు మరోసారి అధికారం చేజిక్కించుకుని, మిగిలిన తెలంగాణ సంపదను కొల్లగొట్టడానికే అబద్ధాలను వల్లె వేస్తున్నారని దుయ్యబట్టారు. మేడిగడ్డను తనకు అప్పగిస్తే నీటిని తరలించి చూపెడతానన్న హరీశ్‌ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘కట్టింది నువ్వే.. కూలగొట్టింది నువ్వే. దొంగనే రిజర్వ్‌ బ్యాంక్‌ తాళాలు అడిగినట్లుంది’’ అని ఎద్దేవా చేశారు.


ఒప్పందం తాత్కాలికమేనని చెప్పడానికి తల ప్రాణం తోకకు..

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు వాదనలు వినిపిస్తున్నామని, తాత్కాలిక ఒప్పందం పేరుతో వాళ్లు తాకట్టు పెట్టిన తర్వాత దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నామని, అందుకు తల ప్రాణం తోకకు వస్తోందని సీఎం రేవంత్‌ చెప్పారు. నికర జలాల్లో అదనపు వాటా కావాలని, ఆరు నెలల్లో తీర్పు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సమ్మక్క కోసం ఛత్తీస్‌గఢ్‌, తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రులను కలిశామని, ప్రధాన మంత్రిని రెండుసార్లు కలిశామని గుర్తు చేశారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలను ప్రస్తావించగా.. సెఫాలజిస్ట్‌ లాగా ఆయన మిక్సాలజిస్ట్‌ (సారా, సోడా కలిపే) అని తిప్పికొట్టారు.


బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లకన్నా మెరుగ్గా ఈ మూడేళ్ల కాలంలో కృష్ణా జలాలను వాడుకున్నాం. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు వాదనలు వినిపిస్తున్నాం. తాత్కాలిక ఒప్పందం పేరుతో వాళ్లు తాకట్టు పెట్టిన తర్వాత దాన్ని విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నాం.

- సీఎం రేవంత్‌


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 03:22 AM