Share News

గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:23 PM

ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

గుప్త నిధుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు.. నలుగురి అరెస్ట్
Hyderabad Hidden Treasure Scam

హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఇళ్ల కింద గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను నమ్మించి మోసగిస్తున్న ఒక ముఠాను రాజేంద్రనగర్ పోలీసుల భాగస్వామ్యంతో శంషాబాద్ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల దగ్గరి నుంచి పలు వాహనాలను, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.రవి వెల్లడించారు.


ప్రధాన నిందితుడు మునావర్ పాత నేరాల చరిత్ర:

బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన నిందితుడు మహ్మద్ మునావర్‌‌పై మోసం కేసు నమోదు చేశారు. అతడిది హైదరాబాద్‌ స్వస్థలం. చదువు పూర్తయిన తర్వాత కార్ల డెంటింగ్, పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చులకు సరిపోకపోవడంతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గుప్త నిధుల సేకరణను ఆసరాగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇళ్ల కింద పూడ్చిపెట్టిన గుప్త నిధులను బయటకు తీసే ప్రత్యేక విద్య తనకు వచ్చు అని ప్రచారం చేసుకుంటూ నిందితుడు పలువురిని మోసం చేస్తున్నాడని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో మునావర్ తన స్నేహితులైన సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్‌లను సంప్రదించి తన పథకాన్ని రచించాడని పోలీసులు వెల్లడించారు.


ఈ అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించవచ్చని భావించిన వారు కూడా ఇందుకు అంగీకరించారని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత, నిందితులు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తమకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని, వారి నివాస స్థలాల కింద భూమిలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించేవారని తెలిపారు. వారు సూచించిన ప్రదేశంలో గుంత తీసిన తర్వాత, ముందే సిద్ధం చేసుకున్న బొగ్గు, నకిలీ బంగారు నాణేలు ఉన్న సంచిని రహస్యంగా అందులో ఉంచేవారని వెల్లడించారు. ఆ తర్వాత, పూజలు చేసి, ఆ బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని చెప్పి నిందితులు అక్కడ నుంచి పరారయ్యేవారని చెప్పారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల్లో దాదాపు 11 మందిని మోసం చేసిందని అన్నారు. సుమారు రూ. కోటి వరకు వసూలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 916/2026, బీఎన్ఎస్ (BNS) చట్టంలోని సెక్షన్లు 318(4), 351(2), 61(2) r/w 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ సిటీ శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ కె. రవి తెలిపారు.


వార్తలు కూడా చదవండి...

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క

తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్‌

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 10 , 2026 | 01:14 PM