Share News

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:02 PM

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు.

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క
Telangana Minister Seethakka

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) సూచించారు. ఈరోజు(ఆదివారం) అశ్వారావుపేటలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, పాల్గొన్నారు. స్థానిక కూడలిలో కుమురం భీమ్ విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. మన జాతి ఔన్నత్యాన్ని, జాతి కీర్తిని మన హక్కులను కాపాడినటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణ చేయడం సంతోషకరమని తెలిపారు.


మన చరిత్ర పోరాటాల చరిత్ర అని మంత్రి సీతక్క అభివర్ణించారు. అడవిలో మన పూర్వీకులు జీవనం మొదలుపెట్టిన నాటినుంచి చెట్టుతో, పుట్టతో, వానలతో, వరదలతో, జంతువులతో పోరాడుతూ ఇక్కడి దాకా వచ్చామని వివరించారు. మరి పోరాటాల చరిత్రలో కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క- సారలమ్మ నుంచి బ్రిటిష్ కాలంలో పోరాడినటు వంటి కుమురం భీమ్ వరకు ఎంతో స్ఫూర్తి పొందామని చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలో చూస్తే మనకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక భూ హక్కులు, ప్రత్యేక ఉద్యోగ, ఉపాధి హక్కులు ఉన్నాయని ప్రస్తావించారు. ఆనాడు అంబేడ్కర్, నెహ్రు ఇద్దరు కలిసి మన జాతికి స్వయం ప్రతిపత్తి ఉండాలని 5వ షెడ్యూల్ ఏరియా ఏర్పాటు చేశారని వివరించారు.


మన ప్రాంతాలకు 6వ షెడ్యూల్ ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాలకు మణిపూర్, అస్సాం, సిక్కిం అలాంటి రాష్ట్రంలో ప్రత్యేక ప్రతిపత్తిని కూడా ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పుడు కూడా తమకు ఎవరితో శత్రుత్వం లేదని అన్నారు. ఈ జాతి సోదరులకు కూడా చెబుతున్నా ఏ కులాన్ని మనం ద్వేషించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏ ప్రాంత ప్రజలను వ్యతిరేకించాల్సిన అవసరం లేదని.. కానీ న్యాయంగా రావలసిన హక్కుల కోసం తాము అడుగుతామని అన్నారు. గిరిజనేతరుడైన నాయకుడు అల్లూరి సీతారామరాజు ఈరోజు అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంకా మన్యం బిడ్డలు పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. ఎవరికీ తాము వ్యతిరేకం కాదని, ఎవరిని ఈ జాతి వ్యతిరేకించలేదని, ఎవరు వచ్చినా అక్కున చేర్చుకున్నామని వెల్లడించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక అవకాశాలను కచ్చితంగా ఉపయోగించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎప్పుడూ అడవి బిడ్డలు, పేదలు, బడుగు బలహీన వర్గాలంటే ప్రత్యేకమైన అభిమానమని చెప్పారు.


దేశంలో ఎక్కడ జరగని కులగణనను చేశారని.. బీసీల కోసం కులగణన చేశారని మంత్రి సీతక్క ప్రస్తావించారు. దళితుల్లో ఉండే సమస్యను కూడా పరిష్కరించామని చెప్పారు. ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయిలో నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. భూముల సమస్యలు సహా గిరిజనుల సమస్యలను తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం పేదలు, నిరక్షరాస్యులు వస్తే వారిని అధికారులు నిర్లక్ష్యం చేయకుండా గౌరవంగా చూడాలని సూచించారు. ప్రజల వినతులను స్వీకరించి వారి కష్టాలకు పరిష్కరించాలని ఆదేశించారు. కుమురం భీమ్ పోరాట స్ఫూర్తితో గిరిజన హక్కుల సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మన భాష, వేషధారణ, సంస్కృతి గిరిజనుల అస్థిత్వం నిలుపుకోవడం మన బాధ్యత అని చెప్పారు. భవిష్యత్తు తరాలకు అందించాల్సిన గొప్ప ఆస్తి మన సంస్కృతి అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్

మాకు క్షుద్ర రాజకీయాలు తెలియవు: కేటీఆర్‌

సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 09 , 2026 | 06:11 PM