Share News

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:15 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు (సోమవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఆయన పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Rahul Gandhi

హైదరాబాద్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కాంగ్రెస్‌లో (Telangana Congress) నూతనోత్సాహం నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రేపు (సోమవారం) రాష్ట్రానికి రానున్నారు. వికారాబాద్‌లో జరిగే డీసీసీ (DCC) అధ్యక్షుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 9:20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. ఉదయం 10:20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వికారాబాద్‌కు బయలుదేరుతారు. ఉదయం 10:30 గంటలకు వికారాబాద్ చేరుకుని, అక్కడి హరిత హోటల్‌లో జరిగే శిక్షణ తరగతులకు హాజరవుతారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు రోజంతా డీసీసీ అధ్యక్షులు, పార్టీ కీలక నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 5:00 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణమవుతారు.


కీలక చర్చలు..

రాహుల్ గాంధీ పర్యటనలో కేవలం శిక్షణ తరగతులకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లను ఖరారు చేసే ఛాన్స్ ఉంది.


మాజీ మావోయిస్ట్ నేతలతో భేటీ..

రాహుల్ గాంధీ పర్యటనలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. మావోయిస్ట్ మాజీ అగ్రనేతలను కలవనున్నారు. ప్రజా సమస్యలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై వారితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.


వికారాబాద్‌లో భారీ ఏర్పాట్లు..

రాహుల్ గాంధీ పర్యటన దృష్ట్యా వికారాబాద్ హరిత హోటల్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. డీసీసీ అధ్యక్షులకు పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారని సమాచారం. రాహుల్ గాంధీ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం రానుంది. ముఖ్యంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 01 , 2026 | 11:21 AM