13 కోట్ల ఓట్లను తొలగించారు.. మోదీ సర్కార్పై మధుయాష్కీ ఆరోపణలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 01:19 PM
ప్రస్తుతం భారతదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని.. అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 17: ప్రస్తుతం భారతదేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని.. అందరూ కలిసి కట్టుగా పోరాటం చేయాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. 2014లో మోదీ ప్రధాని అయ్యాక రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రక్షణ కోసం 2017లో రాహుల్ గాంధీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ను ఏర్పాటు చేశారని తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించాలంటే ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. ఇతర పార్టీలో ఉన్న వారు కూడా ప్రొఫెషనల్ కాంగ్రెస్లో భాగం పంచుకోవచ్చని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సభ్యత్వంలేని వారు కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసం పని చేయొచ్చని అన్నారు.
దేశంలో ‘సర్’(SIR) ద్వారా 13 కోట్ల ఓట్లను మోదీ ప్రభుత్వం తొలగించిందని మధుయాష్కీ ఆరోపించారు. 13 కోట్ల ఓట్లలో ఎక్కువ మంది దళితులు, ఆదివాసీలు, మైనారిటీల ఓట్లు ఉన్నాయన్నారు. తొలగించిన 13 కోట్ల ఓట్లు ఆధారాలతో బయటపెట్టామని అన్నారు. SIRపై పోరాటం కాంగ్రెస్ భవిష్యత్తు కోసం కాదని.. దేశ ప్రజల భవిషత్తు కోసమని స్పష్టం చేశారు. బీజేపీ మోదీ ప్రభుత్వం పౌరుల స్వేచ్ఛను కాలరాస్తోందని విమర్శించారు. క్లిష్ట సమయంలో తనకు అప్పజెప్పిన ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.
మనోహ్మన్ సింగ్ ఫెలోషిప్ ద్వారా వివిధ రంగాల్లో వచ్చిన నిష్ణాతులైన 50 మందికి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చారని మాధుయాష్కీ తెలిపారు. రెండో దఫా 800 అప్లికేషన్స్ వచ్చాయని.. 100 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. బారిస్టర్లు, లాయర్లు, డాక్టర్లతో ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఏర్పడిందన్నారు. భారత పౌరులకు రక్షణ కల్పించేది రాజ్యాంగమన్నారు. ప్రొఫెషనల్స్కు క్రెడిబులిటి ఉండాలని రాహుల్ గాంధీ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకరావడంలో ప్రొఫెషనల్స్ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల కోసం ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పని చేస్తోందన్నారు. ప్రజలకు, ప్రతి పౌరుడికి గౌరవ ప్రదమైన జీవితం అందించడానికి ప్రొఫెషనల్ కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని తెలిపారు. నిష్ణాతులతో ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేశామని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎగిరే కారు శాంపిల్ మాత్రమే.. ఎలాన్ మస్క్ ఏం ప్లాన్ చేశారంటే..?
విజయవాడలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిగా కనకదుర్గమ్మ
Read Latest Telangana News And Telugu News