లీకుల పేరిట మభ్యపెడుతున్నారు.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
ABN , Publish Date - Jan 23 , 2026 | 07:41 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును సిట్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ఈ కేసులో కేటీఆర్‌ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కేటీఆర్‌ను సుమారుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు.
హైదరాబాద్, జనవరి23(ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును (KTR) సిట్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ఈ కేసులో కేటీఆర్‌ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. కేటీఆర్‌ను సుమారుగా 7 గంటలకు పైగా ప్రశ్నించారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న తర్వాత మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. విచారణ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహించారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. లీకులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.
లీకులను ఎవరూ నమ్మొద్దు..
లీకులతో తమకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. లీకులను ఎవరూ నమ్మొద్దు.. ఇది లీకు వీరుల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. లీకులపై ఆధారపడి ప్రభుత్వం నడిపిస్తున్నారని సెటైర్లు గుప్పించారు. కొంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి.. బెదిరించామని బయట ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇది వాస్తవమా? కాదా? అని సిట్‌ను తాను అడిగానని తెలిపారు. ఆ వార్తలు అవాస్తవమని అధికారులు చెప్పారని స్పష్టం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలేవీ అని తాను ప్రశ్నించానని అన్నారు. ఇప్పుడు తమ ఫోన్లు ట్యాప్ కావటం లేదా అని అధికారులను నిలదీశానని తెలిపారు. తన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్లు నమిలారని విమర్శించారు. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి వేధించారని ధ్వజమెత్తారు. విచారణ పేరుతో వేధించడం తప్ప.. వీళ్లు చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. సింగరేణి టెండర్లలో దొంగలు దొరికారని ఆరోపణలు చేశారు.
వారి దోపిడీపై సిట్ వేయరా..
పారిశ్రామికవేత్తకు గన్ పెడితే సిట్ ఎందుకు వేయరు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రుల, సన్నిహితుల దోపిడీపై సిట్ వేయరా,,? అని నిలదీశారు. న్యాయం, ధర్మం అందరికీ ఒకేలా ఉండాలని చెప్పుకొచ్చారు. సెలక్టివ్‌గా లీకులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తనను ఎవరితోనూ కలిపి అధికారులు విచారించలేదని చెప్పుకొచ్చారు. ఈ విచారణలో తాను తప్ప మరే రావు లేరని తెలిపారు. తనను విచారణకు మళ్లీ పిలుస్తామని అధికారులు అన్నారని... బాధ్యత గల ప్రతిపక్షంగా ఏ విచారణకైనా సహకరిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం
బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
Read Latest Telangana News And Telugu News