‘మా ఆస్తులు, మీ ఆస్తులపై విచారణకు సిద్ధం’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:14 PM
ఆస్తుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ‘మా ఆస్తులు, మీ ఆస్తులపై విచారణకు సిద్ధం’ అని స్పష్టం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 1: ఆస్తుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ఆస్తులు, మీ ఆస్తులపై విచారణకు సిద్ధం’ అని స్పష్టం చేశారు. రేవంత్ సోదరులకు రూ.1,000 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తూ.. దీనిపై సిట్టింగ్ జడ్జికి లేఖ రాసేందుకు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ‘మిమ్మల్ని వదలం.. హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. మా తాతకు చింతమడకలో వందల ఎకరాలు ఉండేవి. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా సీఎంకు పంపిస్తా’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు
ఎన్నో అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు బాధలో ఉన్నారని.. వారికి 6 గంటల కరెంట్ కూడా రావడం లేదని తెలిపారు. మోసపోతే గోసపడతారని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని గుర్తుచేశారు. పాత రోజులు మళ్లీ తీసుకొస్తామని రేవంత్ చెప్పారని.. చెప్పినట్టే ఇబ్బందులు ఉన్న పాత రోజులు తెచ్చారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, కరెంట్ కొనుగోళ్లపై కమిషన్లు తుస్సుమన్నాయని అన్నారు. ఫార్ములా-ఈపై కేసు పెట్టారని.. ఏం తేల్చారని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ సిరిసిల్ల పర్యటనపై
సీఎం రేవంత్ రెడ్డి బాధ ఏంటో ఎవరికీ అర్థంకావడం లేదని మాజీ మంత్రి అన్నారు. కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లలో 35 మంది నేత కార్మికులు చనిపోయారన్నారు. సీఎం రేవంత్ వారిని ఆదుకుంటారని అనుకున్నామని.. రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటిస్తారని ఆశించామని తెలిపారు. శత్రుదేశం మీదకు దండయాత్రకు వెళ్లినట్టు సిరిసిల్లకు వెళ్లారని విమర్శించారు. సీఎం రేవంత్ పర్యటనలో పోలీసులు తప్ప ప్రజలు లేరంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి...
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు
ఓట్ల తొలగింపుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. ఈసీకి హెచ్చరిక
Read Latest Telangana News And Telugu News