ప్రభుత్వ విధానాలను మార్చి పేదలకు సేవ చేయటమే నా బాధ్యత: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:32 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక 28వ సారి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు
బాపట్ల జిల్లా, అక్టోబర్ 1: కూటమి ప్రభుత్వం వచ్చాక 28వ సారి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(గురువారం) పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఆపై అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ‘నేను కూడా బటన్ నొక్కొచ్చు.. కానీ సీఎం అంటే ప్రజల మధ్య ఉండాలని వచ్చాను’ అని తెలిపారు. తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని అన్నారు. ప్రభుత్వ విధానాలను మార్చి పేదలకు సేవ చేయటమే తన బాధ్యతగా చెప్పుకొచ్చారు. ప్రతి నెలా నాలుగుసార్లు ప్రజల వద్దకు వస్తున్నట్లు తెలిపారు.
భూసమస్యల పరిష్కారం ద్వారా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామని సీఎం తెలిపారు. 2024 లో 54 శాతం ఓట్లు.. 94 శాతం సీట్లు ఇవ్వటం ద్వారా చరిత్ర సృష్టించారని అన్నారు. ‘మీరు చేసిన పనికి ప్రతిపక్షం లేకుండా పోయింది. మీ మీద కోపంతో అసెంబ్లీకి రాకుండా అలిగాడు’ అంటూ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కూటమి గ్రాఫ్ పెరుగుతోందని.. ప్రతిపక్షం గ్రాఫ్ పడిపోతుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు.
ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని.. ప్రజల్ని ఇబ్బంది పెట్టారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కూటమి వచ్చాక ఆర్థిక ఇబ్బందులున్నా.. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందని చెప్పారు. ఏపీ ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో ప్రజలు వేసిన ఓటు వేసి కూటమిని గెలిపించారన్నారు. ఇప్పటికి రూ.76 వేల కోట్లు పింఛన్ల ద్వారా ప్రజలకు అందజేశామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
‘ఇతర నాయకులు నేర్చుకోవాలి’.. నారా లోకేశ్‌పై రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశం
Read Latest AP News And Telugu News