బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:32 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.
అమరావతి, అక్టోబర్ 1: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది తాండవ యోగేష్.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మొత్తం రిజర్వేషన్లు 59 శాతం మించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ జీవోలు చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని పేర్కొంది. బీసీల జనగణన తరువాత ఎన్నికలు నిర్వహించాలని వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించిన హైకోర్టు.. ఆరువారాల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ‘సర్’ ప్రక్రియ జరుగుతుందనే కారణంతో ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం సరికాదని పేర్కొంది. తుది ఓటర్ల జాబితా ప్రచురణ విషయంలో పంచాయతీరాజ్, పరపాలకశాఖ చట్టనిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది.
‘సర్’ ప్రక్రియ ముగిసిన తరువాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ వైసీపీ వేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం డిస్పోజ్ చేసింది. బీసీ జనగణన చేపట్టి, రిజర్వేషన్ ఖరారు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిల్‌నూ హైకోర్టు కొట్టివేసింది. అలాగే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్ ఖరారు చేయాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియలో జోక్యానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీళ్లలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. సెన్సెస్ కమిషనర్ ఇచ్చిన సర్క్యూలర్ వార్డుల పునర్విభజనపై ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ 2021 జూన్ 9న తీసుకొచ్చిన ఏపీ మున్సిపాలిటీ సవరణ చట్టాన్ని(యాక్ట్ 5/2021)ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి...
బైక్‌ను ఢీకొట్టి కాలువలో బోల్తా పడిన స్కూల్ బస్సు.. 30 మంది విద్యార్థులకు గాయాలు
చేనేతలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ‘నేతన్నల సేవలో’ రెండో విడత సాయం
Read Latest AP News And Telugu News