అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 01 , 2026 | 09:59 AM
అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా తూర్పు కనుమల అద్భుతమైన ప్రకృతి ఒడిలో పండే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సంపద అయిన అరకు కాఫీని గౌరవించుకోవడం ఎంతో గర్వకారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
అమరావతి, అక్టోబర్ 1: అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా తూర్పు కనుమల అద్భుతమైన ప్రకృతి ఒడిలో పండే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సంపద అయిన ‘అరకు కాఫీ’ని గౌరవించుకోవడం ఎంతో గర్వకారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అరకు కాఫీలోని ప్రతి కప్పు తూర్పు కనుమల సువాసనను, అక్కడి నేల సారవంతమైన గుణాన్ని, గిరిజన రైతుల కఠోర శ్రమను తనలో ఇముడ్చుకుని ఉంటుందన్నారు. ‘నా దృష్టిలో, అరకు కాఫీ అంటే కేవలం దాని రుచి, సువాసన మాత్రమే కాదు. ఇది మన అడవులు, గిరిజన సమాజాలు, వారి సంప్రదాయ విజ్ఞానం మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక’ అని అన్నారు.
అరకు లోయల నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ వరకు అక్కడ ప్రత్యేక స్టాళ్ల ద్వారా అరకు కాఫీని ప్రదర్శించారని పవన్ తెలిపారు. దీని ప్రస్థానం, సమాజాల మూలాల నుంచి వచ్చిన ఒక స్థానిక ఉత్పత్తి భారతదేశ కథను విశాల ప్రపంచానికి ఎలా చాటగలదో తెలియజేస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా అరకు కాఫీని, దాని సాగులో పాలుపంచుకుంటున్న గిరిజన కుటుంబాల కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు. అరకు కాఫీని సాధ్యం చేస్తున్న రైతులు, అడవులు, తూర్పు కనుమలను గౌరవించుకుందామన్నారు. ఆంధ్రప్రదేశ్ కొండల నుంచి ప్రపంచంలోని ప్రతి మూలకు అరకు కాఫీని చేరవేసే దిశగా కృషి చేద్దామని అన్నారు. ‘ఒక కప్పు అరకు కాఫీ అంటే మన నేల రుచి, మన ప్రజల కథ, మన తూర్పు కనుమల సువాసనల కలయిక. అంతర్జాతీయ కాఫీ దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్‌లో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఇవీ
నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ
Read Latest AP News And Telugu News