బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశం
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:04 PM
బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
అమరావతి, అక్టోబర్ 1: బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు సీనియర్ న్యాయనిపుణులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. వచ్చే సోమవారంలోపు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈలోపు బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.
ఢిల్లీలో ప్రభుత్వం వేసే పిటిషన్‌పై వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను నియమించాలని సీఎం ఆదేశించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. 6 వారాల్లో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ఎన్నికల కమిషన్, ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంలో పోరాడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం: చింతకాయల విజయ్
స్థానిక ఎన్నికలలో బీసీలకు ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ జీవోలను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు టీడీపీ రాజ్యసభసభ్యుడు చింతకాయల విజయ్ తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే నిర్ణయానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లి పోరాడుతామని అన్నారు. బీసీల రిజర్వేషన్‌పై కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేయించాలని వైసీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లపై వైసీపీకి చెందిన వ్యక్తులు హైకోర్టుకు వెళ్లారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కూడా బీసీలకు రిజర్వేషన్లపై జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లలేదని... బీసీలకు కేవలం 24 శాతం రిజర్వేషన్ మాత్రమే కల్పించారని అన్నారు. దీని వల్ల బీసీలు సుమారు 18 వేల పదవులు కోల్పోయారని వెల్లడించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత చంద్రయ్యను నడిరోడ్డుపై నరికేశారని విజయ్ గుర్తుచేశారు. రేపల్లె నియోజకవర్గంలో అమరనాథ్ గౌడ్ అనే విద్యార్థిని సజీవ దహనం చేశారన్నారు. బీసీలను వైసీపీ నేతలు వెంటాడి వేధించారని, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను అణగదొక్కాలని వైసీపీ ప్రభుత్వం అపట్లో పనిచేసిందని దుయ్యబట్టారు. అందుకే 2024 ఎన్నికలలో వైసీపీకి బీసీలతో పాటు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. బీసీలకు.. జనాభాకు అనుగుణంగా పదవులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు గుర్తింపు తీసుకువచ్చింది, రాజ్యాధికారంలో వాళ్లను భాగస్వామ్యులను చేసింది టీడీపీనే అని తెలిపారు. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని చింతకాయల విజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
‘ఇతర నాయకులు నేర్చుకోవాలి’.. నారా లోకేశ్‌పై రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు
Read Latest AP News And Telugu News