Share News

కాక్‌పిట్‌లో దాడితో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ స్మిత్‌.. అత్యవసర చికిత్స చేసిన డెంటిస్ట్‌

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:55 AM

ఫ్లై దుబాయ్‌ విమానంలో జరిగిన కాక్‌పిట్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌కు ఓ ఇజ్రాయెల్‌ దంత వైద్యుడు ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు కీలకంగా వ్యవహరించారు. దాడి అనంతరం తీవ్ర రక్తస్రావంతో పైలట్‌ స్పృహ కోల్పోతుండగా.. విమానంలో ఉన్న డెంటిస్ట్‌ డాక్టర్‌ షోటా మొసావ్‌ వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లి చికిత్స ప్రారంభించారు.

కాక్‌పిట్‌లో దాడితో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ స్మిత్‌.. అత్యవసర చికిత్స చేసిన డెంటిస్ట్‌

  • కాక్‌పిట్‌లో దాడితో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌

  • తల, చేతులకు తీవ్ర గాయాలు.. భారీగా రక్తస్రావం

  • పడిపోతున్న రక్తపోటును అదుపులోకి తెచ్చిన డాక్టర్‌ షోటా మొసావ్‌

  • ప్రయాణికులు దుండగుడిని కట్టేసి విమానాన్ని సురక్షితంగా మళ్లించారు

ఇంటర్నెట్ డెస్క్: ఫ్లై దుబాయ్‌ విమానంలో జరిగిన కాక్‌పిట్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ పైలట్‌ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌కు ఓ ఇజ్రాయెల్‌ దంత వైద్యుడు ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు కీలకంగా వ్యవహరించారు. దాడి అనంతరం తీవ్ర రక్తస్రావంతో పైలట్‌ స్పృహ కోల్పోతుండగా.. విమానంలో ఉన్న డెంటిస్ట్‌ డాక్టర్‌ షోటా మొసావ్‌ వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లి చికిత్స ప్రారంభించారు.


తల, చేతులు దాదాపు తెగిపోయేంత గాయాలు..

విమానంలో తాను మాత్రమే వైద్యుడినని మొసావ్‌ తెలిపారు. కాక్‌పిట్‌ నుంచి కేకలు వినిపించడంతో అక్కడికి వెళ్లగా.. కెప్టెన్‌ మచ్చార్ తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో కనిపించారని చెప్పారు. ‘ఆయన శరీరమంతా గాయాలే ఉన్నాయి. తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు తెగిపోయేంతగా గాయపడ్డారు’ అని వివరించారు. భారీగా రక్తం పోవడంతో పైలట్‌ పరిస్థితి విషమంగా మారిందని చెప్పారు. రక్తపోటు క్రమంగా పడిపోయిందని, కొద్దిసేపటికి మచ్ఛార్‌ స్పృహ కోల్పోయారని తెలిపారు.


Indian-pilot-Smith-Machar.jpg

రక్తస్రావాన్ని ఆపి.. రక్తపోటును నిలిపి..

మచ్చార్‌కు వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన మొసావ్‌.. ముందుగా రక్తస్రావాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అనంతరం రక్తపోటును స్థిరీకరించగలిగినట్లు చెప్పారు. తీవ్ర పరిస్థితుల్లోనూ చికిత్సకు స్పందించడంతో పైలట్‌ పరిస్థితి కొంత మెరుగుపడిందని తెలిపారు. తర్వాత విమానం సౌదీ అరేబియాలోని టబుక్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. అక్కడి ఆసుపత్రికి తరలించిన మచ్చార్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.


దుండగుడిని కట్టేసిన ప్రయాణికులు

మరోవైపు.. కాక్‌పిట్‌పై దాడి చేసిన వ్యక్తిని ప్రయాణికులు అదుపులోకి తీసుకున్నారు. ‘మేమంతా కలిసి ఆ వ్యక్తిని కట్టేశాం’ అని మొసావ్‌ తెలిపారు. తొలుత హెడ్‌ఫోన్స్‌కు సంబంధించిన వైర్‌తో అతడిని కట్టివేయగా.. ఆ తర్వాత ప్లాస్టిక్‌ జిప్‌ టైలను ఉపయోగించినట్లు చెప్పారు.


TV-Show-On-Aviation-Disasters-Helped-flydubai-Passenger-Steady-Plane.jpg

14 వేల అడుగుల మేర ఒక్కసారిగా కిందకు..

దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లై దుబాయ్‌ ఎఫ్‌జెడ్‌1073 విమానంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాక్‌పిట్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తడంతో విమానం నుంచి ఎమర్జెన్సీ సిగ్నల్స్‌ వెలువడ్డాయి. అనంతరం విమానం కేవలం 30 సెకన్లలో దాదాపు 14 వేల అడుగుల మేర కిందకు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రయాణికులు, సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం విమానాన్ని టబుక్‌కు మళ్లించారు. విమానాశ్రయ అధికారులు ఉదయం 8.44 గంటలకు డిస్ట్రెస్‌ కాల్‌ అందుకున్నామని.. 9.45 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిందని తెలిపారు.


Israeli-Dentist.jpg

గాయపడినప్పటికీ కాక్‌పిట్‌ తలుపు తెరిచిన పైలట్‌

దాడిలో తీవ్రంగా గాయపడిన మచ్చర్.. చివరి శక్తిని కూడదీసుకుని కాక్‌పిట్‌ తలుపు తెరిచినట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రతినిధి వెల్లడించారు. దీంతో విషయం గ్రహించిన ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ఆఫ్‌ డ్యూటీ ఫ్లైదుబాయ్‌ పైలట్లు కూడా అనంతరం విమాన నియంత్రణలో సహకరించారు. దీంతో విమానాన్ని టబుక్‌కు సురక్షితంగా మళ్లించగలిగారు.


దాడి వెనుక కారణమేంటి?

ఈ ఘటనలో కెప్టెన్‌ మచ్చార్, కో-పైలట్‌ ఇద్దరూ గాయపడ్డారు. కో-పైలట్‌ ఒమన్‌కు చెందిన వ్యక్తిగా సమాచారం. ప్రస్తుతం అతడిని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. విమానంలో సుమారు 174 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అనంతరం వారందరినీ ప్రత్యామ్నాయ విమానాల్లో ఇజ్రాయెల్‌కు తరలించారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత పైలట్ మచార్‌పై మోదీ, ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు

ఇంధన నౌక హైజాక్‌.. భారతీయుడి హత్య

Updated Date - Oct 01 , 2026 | 11:51 AM