ఇంధన నౌక హైజాక్
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:57 AM
ఓ ఇంధన నౌకను హైజాక్ చేసిన సోమాలియా సముద్రపు దొంగలు (పైరేట్స్) అందులోని ఐదుగురు సిబ్బందిని హతమార్చారు. మృతుల్లో ఒక భారతీయ నావికుడు, ముగ్గురు పాకిస్థానీలు, ఒక మయన్మార్ పౌరుడు ఉన్నారు.
భారతీయుడు సహా ఐదుగురు నావికుల హత్య
సోమాలియా తీరంలో పైరేట్ల ఘాతుకం
మొగాదీషు, సెప్టెంబరు 30: ఓ ఇంధన నౌకను హైజాక్ చేసిన సోమాలియా సముద్రపు దొంగలు (పైరేట్స్) అందులోని ఐదుగురు సిబ్బందిని హతమార్చారు. మృతుల్లో ఒక భారతీయ నావికుడు, ముగ్గురు పాకిస్థానీలు, ఒక మయన్మార్ పౌరుడు ఉన్నారు. ఈ కాల్పుల్లో మరో భారతీయుడు, ముగ్గురు పాకిస్థానీలు తీవ్రంగా గాయపడ్డారు. సోమాలియా పుంట్‌ల్యాండ్ తీరంలో ఉన్న ఆ నౌకను తమ నియంత్రణలోకి తీసుకునేందుకు భద్రతాబలగాలు ప్రయత్నించిన సమయంలో పైరేట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ నౌకాదళం తెలిపిన వివరాల ప్రకారం.. పలావు దేశ పతాకంతో 18,500 బారెళ్ల ఇంధనంతో సోమాలియా రాజధాని మొగాదీషు వైపు వెళ్తున్న ‘ఎమ్‌టీ ఆనర్ 25’ అనే ఇంధన నౌకను ఈ ఏడాది ఏప్రిల్ 21న సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఆ సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌకను రక్షించడానికి పుంట్‌ల్యాండ్‌కు చెందిన మారిటైమ్ పోలీస్ ఫోర్స్ (పీఎంపీఎఫ్) మంగళవారం నాడు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. భద్రతా దళాలు నౌకను చుట్టుముడుతున్నట్లు గమనించిన పైరేట్లు నౌకలోని సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు నావికులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుదాడికి దిగిన పుంట్‌ల్యాండ్ భద్రతా దళాలు నౌకను విజయవంతంగా తమ ఆధీనంలోకి తీసుకుని, 16 మంది సముద్రపు దొంగలను అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్
రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది