Share News

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:13 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కృత్రిమ మేధకు సంబంధించి నూతన పదజాలాన్ని ప్రవేశపెట్టారు.

సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్
Donald Trump- Super Intelligence

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కృత్రిమ మేధకు సంబంధించి నూతన పదజాలాన్ని ప్రవేశపెట్టారు. ఇకపై తమ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ (ఏఐ) స్థానంలో సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ) పదాన్ని వినియోగిస్తుందన్నారు. ఈ ఆధునిక సాంకేతికత సామర్థ్యాలను ఏఐ పదం తక్కువ చేసి చూపుతోందని ట్రంప్ గతంలోనే అభిప్రాయపడ్డారు. ఇకపై ప్రభుత్వ ఉత్తరప్రత్యుత్తరాలు, ప్రకటనలు అన్నింటిల్లో సూపర్ ఇంటెలిజెన్స్ పదాన్నే వినియోగిస్తామని చెప్పారు. శ్వేత సౌధంలో దిగ్గజ టెక్ సంస్థల నాయకులతో విందు సందర్భంగా ఈ పదాన్ని ట్రంప్ ఆవిష్కరించారు. ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, జెన్సన్ హువాంగ్, సుందర్ పిచాయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఎస్ఐ పేరు ఆవిష్కరణ అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సూపర్ ఇంటెలిజెన్స్ ప్రభావం ప్రపంచంపై, అమెరికాపై అమితంగా ఉండబోతోందని అన్నారు. ‘ఇంతకంటే విప్లవాత్మక సాంకేతికత మనం ఇంతవరకూ చూడలేదు. ఇది ఇంటర్నెట్ ఆవిష్కరణ కంటే పెద్దది. సాంకేతికత రంగంలో యూఎస్ అద్భుత అభివృద్ధి సాధిస్తోంది. తదుపరి తరం కంప్యూటింగ్ సామర్థ్యాలు, ఏఐ వ్యవస్థలతో దేశానికి ప్రయోజనం కలుగుతుంది. ఈ ఎస్‌ఐ మోడల్స్ చాలా సంక్లిష్టమైనవి. ఈ విషయాన్ని నేను మళ్లీ మళ్లీ చెప్పదలుచుకున్నాను. వీటిని మానవాళి శ్రేయస్సు కొసమే వినియోగించాలని ఆశిస్తున్నాను. కట్టుతప్పితే మాత్రం ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది’ అని ట్రంప్ అన్నారు.


ఏఐ పేరును ఎస్ఐగా మార్చాలని ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ అనే పదం ఈ సాంకేతికత సామర్థ్యాన్ని తక్కువ చేసిన చూపుతున్నట్టు ఉందని గతంలో ఓసారి చెప్పారు. అయితే, సాంకేతికత పరంగా ఏఐకి ఎస్ఐకి భారీ తేడాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సూపర్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఇంకా ఉనికిలోకి రాలేదని అన్నారు. మనుషులకు మించిన మేధో సామర్థ్యాలను కనబరిచే సాంకేతికను ఎస్ఐగా పిలుస్తున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 08:33 AM