భారత పైలట్ మచార్‌పై మోదీ, ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 07:25 AM
ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. కోపైలట్ దాడి చేసినా మచార్ తిరిగి అసాధారణంగా పోరాడారని వారు కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. ‘కెప్టెన్ స్మిత్ మచార్ ఒక హీరో. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఆయన పోరాడిన తీరు అద్భుతం. కోపైలట్ కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచినా మచార్ ఎంతో ధైర్యం చేసి విమానంలో ఉన్న వందల మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. మచార్‌ను చూసి భారత్ గర్విస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలి’ అని మోదీ ట్వీట్ చేశారు.
మచార్‌కు తన సెల్యూట్ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కొనియడారు. ‘అసాధారణ పోరాట పటిమ చూపిన భారత్ పైలట్ మచార్‌కు నా సెల్యూట్. ఆయన సకాలంలో కాక్‌పిట్ తెరవడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు అక్కడికి చేరుకుని దుండగుడిని బంధించారు. దీంతో కొన్ని వందల మంది ప్రాణాలను మచార్ కాపాడారు. ఎంతో ఘోరమైన ప్రమాదాన్ని ఆయన తప్పించారు. ఆయన అలా పోరాడి ఉండకపోతే చరిత్రలోనే ఒక భయంకరమైన విపత్తు సంభవించి ఉండేది’ అని నెతన్యాహు పేర్కొన్నారు. మచార్ త్వరగా కోలుకోవాలని నెతన్యాహు కోరుకున్నారు. మచార్ నిజమైన హీరో అని ట్రంప్ కూడా ‘ఎక్స్’ లో అభివర్ణించారు.
కాగా.. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలో మచార్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఫ్లై దుబాయ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన ఈ విమానం బుధవారం ఉదయం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరింది. అందులో మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 166 మంది ఇజ్రాయెల్ పౌరులే. విమానం 31 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. కాక్‌పిట్‌లో పైలట్ స్మిత్ మచార్‌పై ఒమన్‌కు చెందిన కోపైలట్ కత్తితో దాడి చేశాడు.
విమానాన్ని కూల్చేందుకు అతను యత్నంచగా.. మచార్ తీవ్రంగా పోరాడి కోపైలట్‌ను అడ్డుకున్నాడు. మచార్ అరుపులు విన్న విమాన సిబ్బంది, ప్రయాణికులు కాక్‌పిట్ వద్దకు చేరుకుని కోపైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ టైంలో విమానం 31 వేల అడుగుల ఎత్తు నుంచి 14 వేల అడుగుల కిందకు పడిపోయింది. ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు పైలట్లు విమానాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చారు. కాసేపు తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యాపై ఉక్రెయిన్ ‘జాంబీ కార్ల’ యుద్ధం
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి