Share News

ఎన్నికల్లో గెలవలేక రాజ్యంగ సంస్థలపై దండయాత్ర.. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:47 AM

దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్న నిరసన డ్రామాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తన స్థాయి మరిచిపోయి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఎన్నికల్లో గెలవలేక రాజ్యంగ సంస్థలపై దండయాత్ర.. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు
Union Minister Kishan Reddy

ఢిల్లీ, అక్టోబర్ 13: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్న నిరసన డ్రామాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన స్థాయి మరిచిపోయి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో లోక్‌సభ స్పీకర్ రాజీనామా అన్నారని.. ఇప్పుడు సీఈసీ రాజీనామా అంటున్నారని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌పై ఆరోపణలు చేస్తున్నారని.. చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గద్దెదిగాలని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని మండిపడ్డారు.


సుప్రీంకోర్టు సీజేఐ రాజీనామా చేయాలనడం శోచనీయమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. వేలాదిగా సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయమూర్తులపై ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలలో గెలవడం చేతగాక రాజ్యాంగ సంస్థలపై దండయాత్ర చేస్తున్నారని విరుచుకుపడ్డారు. 60 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ మానసికస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ప్రజల మద్దతు లేకుండా అనేక ఏళ్లుగా వరుసగా ఓడిపోతుంటే దానికి ఎన్నికల సంఘం ఏ విధంగా బాధ్యత తీసుకుంటుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.


ఎన్నికల్లో ఓడిపోతున్నారని సుప్రీంకోర్టు జడ్జిలను బెదిరిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ప్రజల తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాహుల్ దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 200 మంది అధికారులు టచ్‌లో ఉన్నారని రాహుల్ గాంధీ అంటున్నారని.. ఎవరిని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ అవినీతి అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని కేంద్ర మంత్రి అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బాబు జగ్జీవన్ రాం, ఎన్టీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందన్నారు. రాహుల్ గాంధీ‌తో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారని తెలిపారు. రాహుల్ గజం ఎగిరితే, రేవంత్ రెండు గజాలు ఎగురుతున్నాంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో తాము ఏ ధర్నా చేయాలన్నా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని.. హైకోర్ట్‌కు వెళ్లి అనుమతి తీసుకుంటే తప్ప ధర్నా చేయలేని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్‌లో ధర్నాకు బీజేపీకి పర్మిషన్ ఇవ్వరని.. ఢిల్లీలో మాత్రం ధర్నాకు అనుమతి ఇస్తలేరని నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. వారానికి ఒకసారి ఢిల్లీ వచ్చి ప్రధానిపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ షిఫ్ట్ చేయాలని స్థానిక ప్రజలు, వ్యాపారులు కోరారని తెలిపారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో ఢిల్లీ ప్రజలు ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

శ్రీశైలంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం: గొట్టిపాటి

కాచిగూడలో తప్పిన ప్రమాదం.. తండ్రి, కూతురిని కాపాడిన కానిస్టేబుల్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 12:13 PM